ఆనాడు రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంతకం చేస్తే, ఇప్పుడు ఆయన కొడుకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్ తొలగించేందుకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. సుమారు 22 ఏళ్ళ క్రితం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జరిగిన పోరాటంలోముగ్గురు విద్యుత్ ఉద్యోగులు చనిపోయారు.
విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఆదివారం, ఆ ముగ్గురు అమరవీరుల సంస్మరణ బహిరంగసభ జరిగింది. దానిలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు తండ్రి ఆశయాలను పట్టించుకోకుండా సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారం మోపుతున్నారు. అప్పుల కోసం విద్యుత్ సంస్కరణల పేరుతో మోటర్లకు మీటర్లు బిగింపజేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచేసి మళ్ళీ ట్రూ అప్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన విద్యుత్ రాయితీలను తొలగిస్తున్నారు. వైఎస్ వారసుడిగా వచ్చిన జగన్ సామాన్య ప్రజలకు మేలు చేస్తాడనుకొంటే వారి జీవితాలు మరింత నరకం చేస్తున్నారు. దీనికోసమేనా సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొన్నది?ఇప్పటికైనా సిఎం జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకొని ప్రజలపై మోపిన అదనపు విద్యుత్ చార్జీల భారాన్ని తొలగించాలి,” అని అన్నారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెసులుతున్న రాజకీయ నాయకులు, అధికారులు తండ్రీకొడుకుల ఆలోచనలు, ఆశయాలు, వ్యవహారశైలి మద్య చాలా తేడా ఉందని చెపుతుంటారు. పరిపాలనా వ్యవహారాలలో అధికారుల సలహాలు, సూచనలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఆయన కుమారుడు జగన్, ఏబీ వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వంటి అధికారులపై ఏవిదంగా కక్షకట్టి సాధించారో అందరూ చూస్తూనే ఉన్నారు. చివరికి సొంత చెల్లి, తల్లిని కూడా పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి బయటకు పంపేశారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాన్య ప్రజల కోసం దేనికైనా సిద్దపడేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగేందుకు దేనికైనా సిద్దపడుతున్నారని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా బద్ధ శత్రువులైనప్పటికీ పరస్పరం గౌరవించుకొనేవారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు చంద్రబాబు నాయుడితో ఏవిదంగా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తండ్రీకొడుకుల మద్య గల ఈ తేడాలను సామాన్య ప్రజలు సైతం చూడగలుగుతున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.



