Cruise Tourism in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సువిశాలమైన సముద్రతీరం ఉంది. సముద్రతీరాలలో పార్కులు, హోటల్స్ వంటివి ఏర్పాటు చేసి కొద్దిగా అభివృద్ధి చేస్తేనే దేశవిదేశాల నుంచి నిత్యం వేలసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. వాటినే పూర్తిగా అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు, ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేస్తే పర్యాటక రంగానికి భారీగా ఆదాయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చింది.

ఇటీవలే విశాఖలో పర్యాటక సదస్సు నిర్వహించగా తొలిసారిగా ఈ రంగంలో ఏపీకి రూ.1,217 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.

Also Read – జగన్‌, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా సిఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది నవంబర్‌లో విజయవాడలో సీ ప్లేన్ సర్వీసులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం, రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల పరంగా వాటికి అవసరమైన అనుమతులు, వాటిని నడిపించేందుకు కావలసిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభం కాబోతున్న సీ ప్లేన్ సర్వీసులు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి.

పర్యాటక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుండటంతో ఇప్పుడు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర మార్గంలో విలాసవంతమైన క్రూజ్ నడిపించేందుకు ఈ రంగంలో ఉన్న డాల్ఫిన్ ఓషన్ క్రూజస్ సంస్థ ఏపీ పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకుంది.

Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!

విశాఖ నుంచి సముద్ర మార్గంలో కాకినాడ ఫిషింగ్ హార్బర్ చేరుకునేందుకు సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సకల సౌకర్యాలతో విలాసవంతమైన ఈ క్రూజ్‌లో 50 మంది వరకు ప్రయాణించవచ్చు.

సాధారణంగా సామాన్య ప్రజలు ఎవరికీ సముద్రంలో విహార యాత్రలు చేసే అవకాశం ఉండదు. కనుక ఈ క్రూజ్‌లో ప్రయాణించడం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. దీనిలోనే పుట్టినరోజు, పెళ్ళిరోజు వేడుకలు, ఇంకా చిన్న పార్టీలు ఇచ్చేందుకు కూడా సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

Also Read – విజయసాయీ ఏమిటీ నస?

ఈ క్రూజ్ పర్యటకానికి మంచి ప్రజాధరణ లభిస్తుందని పర్యాటకశాఖ అధికారులు, డాల్ఫిన్ సంస్థ నిర్వాహకులు భావిస్తున్నారు. తొలిదశలో విశాఖ-కాకినాడ-విశాఖ మద్య ఈ క్రూజ్‌ నడిపించి, డిమాండ్ పెరిగితే కాకినాడ నుంచి నెల్లూరు వరకు కూడా పొడిగించాలని భావిస్తున్నామని డాల్ఫిన్ సంస్థ నిర్వాహకులు చెప్పారు.




అన్ని అనుమతులు లభించి, అన్ని ఏర్పాట్లు పూర్తికాగానే ఈ క్రూజ్‌ టికెట్ ధరలు, వివరాలు ప్రకటిస్తామని పర్యాటకశాఖ అధికారులు, డాల్ఫిన్ ఓషన్ క్రూజస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.