మాజీ మంత్రి ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగి ఆ తరువాత వైకాపాలో జాయిన్ అయ్యి బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు జనసేనలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా నుంచి బయటకు వచ్చేసిన తరువాత దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ తటస్థంగా ఉన్నారు.
టీడీపీలో జాయిన్ కావడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు అయితే స్థానిక ఇబ్బందుల వల్ల చంద్రబాబు ఎటు తేల్చకుండా కాలం గడిపారు. అయితే దాడిని స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించాల్సినంత ఉందా అని జనసేన అభిమానులే అనుకుంటున్నారు. అనకాపల్లిలో ఆయన ప్రభావం ఎప్పుడో తగ్గిపోయింది.
కాకపోతే ఆయన వల్ల గవర ఓట్లు పడతాయని, గవర- కాపు ఓట్లతో అనకాపల్లి గెలవచ్చని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. దాడి చివరిసారిగా ఒక ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొని గెలిచింది 1999లో. దీనితో ఆయన ప్రభావం అంతంత మాత్రమే ఉండొచ్చు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి విశాఖ ఎంపీగా బరిలో దిగిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారు.



