ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజునే దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేశారు. ఇవాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట బిజెపి శ్రేణులు ధర్నాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలకు ఇచ్చిన రూ.8,000 కోట్లను జగన్ ప్రభుత్వం స్వాహా చేసిందని తక్షణం వాటిని విడుదల చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
ఒంగోలులో జరుగుతున్న ఈ ధర్నాలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “పంచాయతీలకు ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం స్వాహా చేసేయడంతో సర్పంచ్‌ల చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఓరోజు ఆ నిధులను విడుదల చేస్తుందనే నమ్మకంతో అనేకమంది సర్పంచ్‌లు అప్పులు చేసి తమ తమ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించకపోవడంతో అనేకమంది సర్పంచ్‌లు ఈ అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు. వారి ఆత్మహత్యలకు సిఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కారా?” అని ప్రశ్నించారు.
ఇది జగన్ ప్రభుత్వం సృష్టించి సమస్య అని అర్దమవుతూనే ఉంది. దేశంలో అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు అందిస్తుంటుంది. గ్రామాలలో మౌలికవసతుల కల్పనకు, గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆదారపడకూడదనే ఓ సదుద్దేశ్యంతో కేంద్రం నిధులు ఇస్తుంటే, సంక్షేమ పధకాలు, వాలంటీర్లు, సచివాలయాలు అంటూ తలకు మించిన భారం ఎత్తుకొన్న జగన్ ప్రభుత్వం వాటి కోసం ఈ నిధులను కూడా పక్కదారి పట్టించేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే జగన్ ప్రభుత్వం ఇవాళ్ళ తొలిసారిగా పంచాయతీ నిధులను మళ్ళించలేదు. చాలా కాలంగానే ఇది సాగుతోంది. ఇది తెలిసి ఉన్నా కేంద్రం నిధులు ఇస్తూనే ఉంది. పురందేశ్వరికి కూడా ఈ సమస్య గురించి చాలాకాలం క్రితమే తెలుసు. అయితే అప్పుడు సోమూ వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా ఉన్నందున ఆమె మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు దీనిని ఆయుధంగా ఎంచుకొన్నారు.
ఒకవేళ ఏపీ బిజెపి మొదటే దీనిపై పొరాడి ఉండి ఉంటే ఇప్పుడు పురందేశ్వరి ప్రారంభించిన ఈ పోరాటంలో చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మేవారు. కానీ ఇంతకాలం మౌనంగా ఊరుకొని ఇప్పుడు పోరాటం మొదలుపెట్టడం, రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొనే ప్రయత్నంగానే ప్రజలు చూస్తున్నారు.
అందుకే జగన్ ప్రభుత్వం కూడా బిజెపి చేస్తున్న ఈ పోరాటాలను ‘లైట్’ తీసుకొంటోంది. కనుక ఏపీ బిజెపి ముందు తన విశ్వసనీయతను నిరూపించుకొన్నాక పోరాటాలు చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఏపీ బిజెపి చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలన్నీ ఏట్లో పిసికిన చింతపండే అవుతుంది.



