ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎన్టీఆర్ గౌరవార్ధం ఆయన బొమ్మతో ముద్రించిన రూ.100 నాణేలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చోన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏదో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో మీడియాలోకి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన అర్ధాంగి, ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు జేపీ నడ్డాతో వేరేగా భేటీ అయ్యారు.
బిజెపితో టిడిపికి పొత్తులు లేవు కనుక చంద్రబాబు నాయుడు జేపీ నడ్డాను వేరేగా కలవాల్సిన అవసరం లేదు. కానీ ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వెంటబెట్టుకొని జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారంటే పొత్తుల కోసమే అని అర్దమవుతోంది.
దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి బాగా తెలుసు కనుక టిడిపితో పొత్తులకు ఆమె కూడా సానుకూలంగానే ఉన్నారని భావించవచ్చు. బహుశః అందుకే ఆమె చంద్రబాబు నాయుడుతో కలిసి జేపీ నడ్డాతో భేటీ అయ్యి ఉండవచ్చు. ఒకవేళ టిడిపితో బిజెపి పొత్తులకి జేపీ నడ్డా అంగీకరిస్తే, తర్వాత వారందరూ అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ టిడిపి, బిజెపిల పొత్తులు కుదిరిన్నట్లయితే, ఏపీలో రాజకీయ బలాబలాలు మారిపోతాయి. అప్పుడు బిజెపి, జనసేన, టిడిపిలు మళ్ళీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది కనుక తర్వాత సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు చర్చించుకోవలసి ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో స్పష్టత ఈయవలసి ఉంటుంది. ఒకవేళ టిడిపితో బిజెపి పొత్తు వద్దనుకొన్నా చంద్రబాబు నాయుడు తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఢిల్లీలో ఏం జరుగుతోందో… అని వైసీపీ నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.



