ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన, టిడిపితో పొత్తు ఖరారు చేసుకొని సీట్ల సర్దుబాట్ల వరకు వచ్చేసింది. మరోపక్క ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నేనే’ అని గొప్పగా చెప్పుకొంటున్న వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు వచ్చేస్తున్నారు. అయినా పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ ఇంకా అయోమయంలోనే ఉంది.
ఇలాంటి పరిస్థితులలో ఏవిదంగా ముందుకు సాగాలో, మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలియక, ఎవరి గురించి ఏవిదంగా మాట్లాడాలో… ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో సహా అందరూ ఢిల్లీ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఢిల్లీ నుంచి సిగ్నల్ వచ్చేస్తుందనుకొంటే ఇంతవరకు సిగ్నల్ రాలేదు.
ఈలోగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లేఖలో టిడిపి, జనసేనలకు ప్రధాని నరేంద్రమోడీ ఆశీర్వాదాలు ఉన్నాయంటూ చిన్న లైన్ జోడించి క్లైమాక్స్ సీన్‌లో ట్విస్ట్ ఇచ్చారు.
ఈసారి జరుగబోయేది కురుక్షేత్ర మహాసంగ్రామమే, అదీ… ఓ 20 రోజుల ముందుగానే మొదలవుతుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించేసారు. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి చర్చించేందుకు నేడో రేపో కేంద్ర ఎన్నికల కమీషన్ విజయవాడకు రాబోతోంది.
వైఎస్ షర్మిలకు, దగ్గుబాటి పురందేశ్వరి ఇద్దరికీ పెద్ద తేడా లేదని వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని తేల్చి పడేశారు. మరి ఈ పరిస్థితులలో ఏపీ బీజేపీ ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? అంటే దానికి బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ చక్కటి సులువైన సమాధానం చెప్పారు.
‘ఏపీలో రాబోయేది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారే’ అని చెప్పుకొంటూ తిరగమని సూచించారు. అంటే ‘175 సీట్లు మనకే’ అని వైసీపి చెప్పుకొంటున్నట్లన్న మాట! దీనికి ఎవరినీ నిందించక్కరలేదు… ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు కనుక కాలక్షేపానికి డబుల్ ఇంజన్ సర్కారే బెటర్!




