దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా వైసీపీ ప్రభుత్వం దుమ్ము దులిపేశారు. అలా ఇలా కాదు… గణాంకాలతో సహా చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఎందుకుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటుకి, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, టిడ్కో ఇళ్ళు, జాతీయ ఉపాధి హామీ, బియ్యం పంపిణీ, రైతు భరోసా వంటి సంక్షేమ పధకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నిటినీ జగన్ ప్రభుత్వం స్వాహా చేసేస్తుండటం లేదా పక్కదారి పట్టించేస్తుండటం లేదా తామే అన్ని ఇస్తున్నామని ప్రచారం చేసుకొంటుండటం వలననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడంలేదనే దుష్ప్రచారం జరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఏపీ బిజెపి కూడా అపవాదు భరించాల్సి వస్తోందని అన్నారు.
ఈ తొమ్మిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు రూ.1.15 లక్షల కోట్లు ఖర్చు చేసి సుమారు 4,863 కిమీ పైగా కొత్తగా జాతీయ రహదారులు నిర్మించిందని కానీ ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఎన్ని కిమీ రోడ్లు నిర్మించిందో చెప్పగలదా?ప్రతీరోజు ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రోడ్ల మీదే తిరుగుతుంటారు కనుక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏవిదంగా ఉందో మీకు బాగా తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియకపోతే ప్రజలను అడిగితే చెపుతారన్నారు.
దేశవ్యాప్తంగా 4 కోట్ల టిడ్కో ఇళ్ళు నిర్మిస్తుంటే వాటిలో 22 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంజూరు చేసింది. వాటిలో ఒక్కో ఇల్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తనవాటాగా రూ.1.80 లక్షల చొప్పున ఇప్పటికే రూ.20 వేల కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేసింది. కానీ కనీసం 35% ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఎందువల్ల?అని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం వైఖరి వలన కేంద్ర ప్రభుత్వం ఎంతగా సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. ఉన్నవి కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫాక్చరింజ్ జోన్ కింద కనిగిరి-చిత్తూరు మద్య పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. కానీ ఇదే పధకం కింద రాజస్థాన్‌లో సుమారు రూ.25,000 కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
జాతీయ ఉపాధి హామీ పధకం కింద 2020 నుంచి 2021వరకు రూ.10,325 కోట్లు, 2021-222లో రూ.7,183 కోట్లు, 2022-23 వరకు రూ.8,273 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. అయితే ఈ పధకం ద్వారా అందె నిధులతో గ్రామాలలో జరుగుతున్న పనులన్నిటినీ మేమే చేస్తున్నామంటూ జగన్ ప్రభుత్వం చెప్పుకొంటోందన్నారు.
కరోనా సమయం నుంచి నేటి వరకు రాష్ట్రంలో 90 లక్షల మంది పేద ప్రజలకు 5 కేజీలు బియ్యం, ఒక కేజీ కందిపప్పు అందజేస్తోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 2020-21లో రూ.8,500 కోట్లు, 2021-22లో రూ.9,300 కోట్లు, 2022-23లో రూ.10,200 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయపడాలనే ఉద్దేశ్యంతో అనేక పధకాలు అమలుచేస్తోంది. వాటిలో కిసాన్ సమ్మాన్ యోజన కూడా ఒకటి. దాని కింద ప్రతీ రైతుకీ ఏడాదికి రూ.6,000 చొప్పున అందజేస్తోంది. అయితే ముఖ్యమంత్రి దానికి మరో రూ.6,000 కలిపి మొత్తం తానే ఇస్తున్నట్లు చెప్పుకొంటున్నారని దగ్గుబాటి పురందేశ్వరి తప్పు పట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇంతగా తోడ్పడుతూ లక్షల కోట్లు ఇస్తున్నా, వైసీపీ ప్రభుత్వం వైఖరి కారణంగా ఏమీ చేయడం లేదనే అపవాదు భరించాల్సివస్తోందని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
జనసేనతో పొత్తులు ఇదివరకూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా ఉంటాయని చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయం తమ అధిష్టానం నిర్ణయిస్తుందని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.



