ఏపీలో మద్యం వ్యాపారం పేరుతో పెద్ద కుంభకోణం జరుగుతోందని, దానిలో వైసీపి ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారులంటూ మరికొందరు పాత్రధారుల పేర్లు కూడా బయటపెట్టారు. నిజానికి ఆమె బయటపెట్టిన ఈ వివరాలు రాష్ట్ర రాజకీయాలలో బాంబులా విస్పోటనం అవ్వాలి. కానీ ఎవరూ దానిని పట్టించుకొనే లేదు.
మద్యం వ్యాపారాలలో ఉన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆమె భావిస్తుంటే, కేంద్రంలో వారి పార్టీయే అధికారంలో ఉంది కదా? దర్యాప్తు చేయించుకోమనండి. ఎవరు వద్దన్నారు?” అంటూ చాలా తేలికగా ఆమె ఆరోపణలను కొట్టిపడేశారు. తద్వారా తమ ప్రభుత్వానికి మోడీ, అమిత్ షాల ఆశీసులు ఉన్నాయని మంత్రి బొత్స చెప్పకనే చెప్పారు.
బొత్స సత్యనారాయణకు అర్దమైన ఈ విషయం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి అర్దం కాలేదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమె ఇంతగా ఒత్తిడి చేస్తున్నా ఏపీలో మద్యం కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపేందుకు ఎందుకు వెనకాడుతోంది? అంటే తెలంగాణ సిఎం కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ తేనె తుట్టె కూడా కదులుతుందనే భయంతోనే కావచ్చు.
నిజానికి గత నాలుగున్నరేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఎడాపెడా అప్పులు ఇప్పిస్తూ ఆయన ప్రభుత్వం నడిచేందుకు తోడ్పడుతూ తాము ఆయన వైపే ఉన్నామని మోడీ, అమిత్ షాలు సూచిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్టుపై స్పందించకుండా వారివురూ మౌనంగా ఉండిపోవడం ద్వారానే తాము జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నామని చెప్పకనే చెప్పేశారు. ఇదే కారణంగా పవన్ కళ్యాణ్ తమకు దూరం అవుతున్నాడని తెలిసినా వారు పెద్దగా పట్టించుకోలేదు.
మరి ఈ సంకేతాలన్నిటినీ దగ్గుబాటి పురందేశ్వరి అర్దం చేసుకోలేకపోతున్నారనుకోవాలా?ఒకవేళ అర్దం చేసుకొన్నా తన సోదరి భువనేశ్వరికి వచ్చిన ఈ కష్టాన్ని చూసి ఆగ్రహంతో పార్టీ అధిష్టానం వైఖరిని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి మీద కత్తులు దూస్తున్నారా?ఓ పక్క మోడీ, అమిత్ షాలు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండాలనుకొంటుంటే ఆమె పోరాడి ఇక ఏం ప్రయోజనం?






