ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు వివరించి తిరిగి రాగానే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో మద్యం పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాల గురించి వివరించేందుకు ఆమె ఢిల్లీ వెళ్ళారని చెప్పుకొంటున్నా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించడానికే ఆమె ఢిల్లీ వెళ్ళారని అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు అరెస్టు, టిడిపి, జనసేనల పొత్తుల గురించి ‘వైసీపి వెర్షన్’ జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. కనుక ఇప్పుడు పురందేశ్వరి ‘బీజేపీ వెర్షన్’ గురించి చెప్పారు.
‘ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశానని’ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరు జారారు కనుక ‘జనసేన వెర్షన్’ కూడా వినేందుకు ఆయనను ఢిల్లీకి పిలుస్తారో లేదో పురందేశ్వరి విజయవాడకు తిరిగి వచ్చేశాక తెలుస్తుంది. ఒకవేళ జనసేనతో పొత్తులకే బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లయితే ఆమె అక్కడ ఉండగానే పవన్ కళ్యాణ్‌ని కూడా ఢిల్లీకి పిలిచి ఆ సంగతీ తేల్చేయవచ్చు.
అయితే ఇప్పుడు ఢిల్లీలో జరిగే ఈ భేటీల ప్రధాన అజెండా జనసేనతో బీజేపీ పొత్తు మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్ల ఢిల్లీ పెద్దల వైఖరి ఏమిటనేది కూడా.
నేడో రేపో తెలంగాణతో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో మోడీ, అమిత్ షాల పర్యటనల షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. కనుక ఇక నుంచి వారిద్దరూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అంటే… మరో మూడు నెలలు బిజీ అయిపోతారు. కనుక ఏపీ రాజకీయ పరిణామాలపై ఇక తాడో పేడో తేల్చేయాల్సిన సమయం వచ్చిన్నట్లే భావించవచ్చు. మరి ఏమి తెలుస్తారో చూద్దాం!



