వరుస వైఫల్యాలతో కెరీర్ కొనసాగిస్తున్న సాయి కుమార్ తనయుడు ఆది నటించిన తాజా చిత్రం “చుట్టాలబ్బాయ్” కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఎలాగైనా ప్రేక్షకులను రప్పించాలనే ప్రయత్నం మాత్రం గట్టిగానే కనపడుతోంది. ఇందు నిమిత్తం ప్రముఖ లెజెండరీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, ఈ సినిమాను చూసి అభినంధించినట్లుగా చిత్ర యూనిట్ పబ్లిసిటీ చేస్తోంది.
ఇప్పటికే ఇంటి దారి పట్టిన “చుట్టాలబ్బాయ్” సినిమాకు నిజంగా దాసరి అభినందనలు వర్కౌట్ అవుతాయా? అంటే దానికి జవాబు అందరికీ తెలిసిందే. మరి అయినప్పటికీ చిత్ర యూనిట్ చేస్తున్న పబ్లిసిటీలో అర్ధం ఏముంది? సోషల్ మీడియా పుణ్యమా అని ఫస్ట్ షో పడిన మరుక్షణమే ‘టాక్’ వచ్చేస్తున్న నేపధ్యంలో, ఈ పాత చింతకాయ పచ్చడి పబ్లిసిటీలు ఎవరిని ఉద్ధరించేను?
సినిమా బాగుంటే నటీనటులు ఎవరూ తెలియకపోయినా ‘పెళ్ళిచూపులు’ మాదిరి హిట్ చేస్తున్నారు, అదే సినిమాలు ఆకట్టుకోని పక్షంలో అది పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ బాబు అయినా… చివరికి ఆది అయినా ప్రేక్షకులకు ఒక్కటే. ఫ్లాప్ సినిమాకు పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసినా చూడరు, అలాగే మంచి సినిమాలకు పబ్లిసిటీని పట్టించుకోరు. ఈ తరుణంలో 70, 80వ దశకాల నాటి దాసరితో పబ్లిసిటీ ఏంటో ఈ ‘చుట్టాలబ్బాయ్’ చిత్ర యూనిట్ కే తెలియాలి. ముఖ్యంగా హీరోగా నటించిన ‘చుట్టాలబ్బాయ్’ ఆదిని మాత్రం అందరూ ‘నువ్వు ఎదగాలబ్బాయ్’ అంటున్నారు.



