
ఈసారి దావోస్ సదస్సులో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!
ఈ సదస్సులో తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు, పరిశ్రమలు సాధించేందుకు తాము పోటీ పడుతున్నమాట నిజమని, కానీ ఈ పోటీ ద్వారా భారత్ ఆర్ధిక వ్యవస్థని ట్రిలియన్ డాలర్ స్థాయికి చేర్చాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని వారు చెప్పారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కి ఐటి కంపెనీలను రప్పించి ఎంతగానో అభివృద్ధి చేశారని, ఇప్పుడు తాను నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని మిగిలిన సమయంలో రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెప్పారు.
Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలు ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు.
ఈవిదంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘మేమందరం ఒక్కటే.. మా దేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టండి’ అంటూ చాలా చక్కటి సందేశం ఇవ్వడం చాలా అభినందనీయం. ఇది పెట్టుబడిదారులకు భారత్ పట్ల సదాభిప్రాయం కలిగిస్తుంది. తద్వారా దేశానికి మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి.
Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?
ఈసారి దావోస్ సదస్సులో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం ఇప్పటి వరకు దాదాపు 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగింది. అన్నివిదాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, రాజకీయాలకు అతీతంగా పారిశ్రామిక విధానం అమలుచేస్తుండటం ఇందుకు కారణమని చెప్పొచ్చు.
అయితే ఆంధ్రప్రదేశ్ ఇంకా బోణీ కొట్టలేదు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వారి బృందం భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలలో పాల్గొంటున్నారు. కనుక సదస్సు ముగిసేలోగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, దిగ్గజ కంపెనీలను సాధించుకువస్తారని ఆశించవచ్చు.
ఇక ఈ సదస్సులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకోవడం, వారు ఇంగ్లీషులో మాట్లాడే విధానంపై రెండు తెలుగు రాష్ట్రాలలో విపక్షపార్టీలకు చెందిన సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది.
గతంలో జగన్, కేటీఆర్ సదస్సులో కలిసినప్పుడు వారికి అభ్యంతరంగా అనిపించలేదు. కేటీఆర్ జగన్‌ని ‘అన్నా అన్నా..’ అని పిలుస్తూనే తెలంగాణకు భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకుపోగా, జగన్ ఉత్త చేతులతో తిరిగివచ్చినప్పుడు తప్పుగా అనిపించలేదు. కానీ దావోస్ సదస్సులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకుంటే ఏదో గూడు పుఠాణీ జరిగిపోతోందన్నట్లు దుష్ప్రచారం చేయడం బాధాకరం.
రష్యా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాధినేతలు ఇంగ్లీషులో మాట్లాడరు. వారి భాషలలోనే మాట్లాడితే అందరూ దుబాసీలను పెట్టుకొని వారు చెప్పేది విని అర్దం చేసుకోవాలని ఇతర దేశస్తులు ప్రయత్నిస్తారే తప్ప వారికి ఇంగ్లీషు రాదని ఎవరూ ఎగతాళి చేయరు. కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇంగ్లీషులో మాట్లాడితే ఎద్దేవా చేస్తుంటారు.
దావోస్ సదస్సులో ఇంగ్లీష్ భాషా నైపుణ్యం పోటీలు జరగడం లేదు. పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకోవడానికి అందరూ పోటీ పడుతున్నారు. కనుక ఎవరు ఎంతెంత పెట్టుబడులు, ఎన్ని పరిశ్రమలు తమ రాష్ట్రాలకు సాధించుకున్నారనేదే ముఖ్యం.
ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడటం రాదని ఎద్దేవా చేయబడుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే సుమారు 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా సాధించబోతున్నారు.
కనుక తమతమ రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు వారి కృషి, తపనని గుర్తించి అభినందించాలి తప్ప కోడిగుడ్డుకి ఈకలు పీకడం సబబు కాదు.