భారత్‌కు పెను సవాలే ఇది!

ATC system glitch causes massive flight delays at Delhi International Airport

భారత్‌ పౌరవిమానయాన శాఖకు ఇదివరకు ఎన్నడూ ఎదురవని అతిపెద్ద సాంకేతిక సమస్యని ఎదుర్కొంటోంది. రోజుకి సుమారు 1,500కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడింది.

దీంతో డజన్ల కొద్దీ విమానాలు రద్దవుతున్నాయి లేదా 10-12 గంటలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి లేదా ఢిల్లీ మీదుగా రాకపోకలు సాగించే విమానాలు రద్దవుతున్నాయి లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి.

ADVERTISEMENT

అలాగే ఢిల్లీ నుంచి, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్ళే విమానాలు కూడా ఈ కారణంగా ఆలస్యమవుతున్నాయి.

తాజాగా బెంగళూరుతో సహా మరికొన్ని విమానాశ్రయాలలో కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది. పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం రాత్రి అంతా బెంగళూరు ఏటీసీలోనే ఉన్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకొని ఇప్పుడు అక్కడి ఏటీసీలో సమస్య గురించి అధికారులు, నిపుణులతో చర్చిస్తున్నారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో విమానాలు రాకపోకలను, ఫ్లైట్ ప్లాన్ నియంత్రించే ‘ఆటోమేటిక్ స్విచ్చింగ్ సిస్టం’ ఉంటుంది. దీనిలో సాంకేతిక లోపం ఏర్పడటం వలన ప్రతీ విమానాన్ని సిబ్బంది స్వయంగా పంపించాల్సి వస్తోంది. దీనికి చాలా సమయం పడుతుంది కనుక విమానాలు ఆలస్యమవుతున్నాయి.

ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ ఫ్లైట్ రాడార్ 24.కామ్‌ ప్రకారం ఢిల్లీతో సహా దేశంలో పలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో ‘ఆటోమేటిక్ స్విచ్చింగ్’ కొరకు కాలం చెల్లిన సాఫ్ట్ వేర్‌నే ఉపయోగిస్తున్నాయి.

దానినీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోవడం, రియల్ టైమ్‌ బ్యాకప్ లేకపోవడంతో, సైబర్ నేరగాళ్ళు మాల్ వేర్ ప్రవేశపెట్టి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఆ మాల్ వేర్‌ వల్లనే ‘ఆటోమేటిక్ స్విచ్చింగ్’ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది. సీఎన్ఎన్ న్యూస్ ఛానల్‌ కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది.

ఢిల్లీతో సహా ఇతర విమానాశ్రయాలలో ఏర్పడిన ఈ సాంకేతిక సమస్యని పరిష్కరించేందుకు సంబంధిత ఐటి సంస్థ, నిపుణులు కృషి చేస్తున్నారు. ఈ సమస్య ఇంకా ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలీని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఇది భారతీయ పౌర విమానయాన శాఖకు ఒక సవాలు మాత్రమే కాదు గుణపాఠం కూడా!

ADVERTISEMENT
Latest Stories