ప్రస్తుత కాలంలో సగటు వ్యక్తి సంపాదనలో సింహ భాగం అయితే అటు విద్య కు లేకుంటే ఇటు వైద్యానికి అన్నట్టుగా తయారయ్యింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు తలకు మించిన భారం అయినప్పటికీ పిల్లల భవిష్యత్ కోసం కార్పొరేట్ సంస్థల వైపు మొగుచ్చుతున్నారు.
దీన్ని అలుసుగా తీసుకుంటున్న ప్రయివేట్ విద్యాసంస్థలు ఇష్టా రీతిగా, ఇబ్బడిముబ్బడిగా స్కూళ్ల ఫీజులను పెంచుకుంటూ చదువు “కుంటున్నాం” అనే స్థాయి నుంచి చదువు “కొంటున్నాం” అనే స్థాయికి విద్యా వ్యవస్థను పట్టుకొచ్చారు. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ విద్యా సంస్థల మాఫియా దందాలను అరికట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే వస్తున్నారు.
కొన్ని బడా కార్పొరేట్ విద్యాసంస్థలైతే LKG చదివే పిల్లాడికి కూడా లక్షలలో డొనేషన్లు తీసుకుంటున్న వైనాలు చూస్తున్నాం. అయితే ఈ ఫీజుల బాదుడు నుండి ఎంతోకంత తమకు ఉపశమనం కల్పించాలంటూ ప్రతి ఏడూ తల్లితండ్రులు ప్రభుత్వాలను వేడుకోవడం, విద్యార్థులు ధర్నాలు చేయడం షరా మామూలయిపోయింది.
అయితే ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ ఇక ప్రవైట్ విద్యా సంస్థల ఫీజుల పై కూడా ప్రభుత్వ నిబంధన తప్పనిసరి అంటూ ఫీజుల పెంపు పై చట్టం తీసుకొచ్చింది ఢిల్లీ సర్కార్. ఢిల్లీలో కొత్తగా కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం తల్లితండ్రుల కష్టాన్ని గుర్తించి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక దాహానికి కళ్లెం వేసేలా చట్టాన్ని రూపిందించింది.
ఇందుకు గాను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ నిబంధనలకు మీరి విద్యా సంస్థలు తల్లితండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే ఆ పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం అంటూ ‘పాఠశాల ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లును’ ప్రకటించి ఆ బిల్లుకు మంత్రి మండలి ఆమోద ముద్ర కూడా వేసింది.
దీనితో ఢిల్లీలో ఉన్న 1677 పాఠశాలలో ఫీజుల నియంత్రణ పై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ఫీజులు పెంచి విద్యార్థి తల్లితండ్రుల మీద అధిక ఆర్థిక భారం వేస్తే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామంటూ సీఎం రేఖ గుప్తా సదరు విద్యా సంస్థలకు గట్టి హెచ్చరికలు కూడా పంపించారు.
దీనితో సీఎం నిర్ణయం పై సర్వత్రా హర్షిదిరేఖాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటువంటి చట్టాలు దేశం మొత్తం అమలు అవ్వాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే చట్టాలు చేయడమే కాదు ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేయడం కూడా ఒక పెద్ద సాహసమే, ఆ సాహసం ఒక మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా సంక్రమంగా ఆచరించి అందరికి ఆదర్శంగా నిలవాలంటూ ఆమె పై ప్రసంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.




