32 బంతులు… 8 సిక్సర్లు… 4 ఫోర్లు… 82 పరుగులు..!

Delhi dare devils Vs Gujarat lions IPL 2016టీ20 మ్యాచ్ లలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అన్న దానికి సంకేతం… ఢిల్లీ వేదికగా జరిగిన డేర్ డెవిల్స్ – గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మిత్ 53, మెక్కల్లం 60 పరుగులతో చెలరేగడంతో ఒకానొక సమయంలో 200 పరుగులను అవలీలగా దాటుతుందని భావించిన గుజరాత్ జట్టును ఢిల్లీ బౌలర్స్ చివరి 10 ఓవర్లలో కట్టడి చేయగలిగారు.

లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు తొలి 10 ఓవర్లలో కేవలం 51 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. వన్ సైడ్ గా సాగుతున్న మ్యాచ్ లో 11వ ఓవర్లో ‘సునామీ’లా అడుగుపెట్టిన మోరిస్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేసాడు. మోరిస్ దెబ్బకు తదుపరి అయిదు ఓవర్లలో ఏకంగా 61 పరుగులు వచ్చి విజయపు బరిలో ఢిల్లీ నిలిచింది. చివరి 5 ఓవర్లలో 57 పరుగులు చేయాల్సిన తరుణంలో విరుచుకుపడిన మోరిస్ 3 ఓవర్లలో 39 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ ఢిల్లీ వైపుకు మొగ్గు చూపింది.

ADVERTISEMENT

ఈ తరుణంలో విజయానికి 2 ఓవర్లలో 18 పరుగులు చేయాల్సిన ఢిల్లీ జట్టుకు 19వ ఓవర్లో ప్రవీణ్ కుమార్ గట్టి షాక్ ఇచ్చాడు. 19వ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇవ్వడంతో చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా, బ్రావో బాల్ అందుకున్నాడు. తొలి బంతిని బౌండరీ బాది మ్యాచ్ ను గెలిపిస్తాడనుకున్న మోరిస్ దూకుడుకు బ్రావో తెలివైన బంతులతో బోల్తా కొట్టించి విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉంచాడు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసి, 1 పరుగు తేడాతో ఓటమి పాలయ్యింది. 32 బంతులు… 8 సిక్సర్లు… 4 ఫోర్లు… 82 పరుగులతో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడిన మోరిస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

ADVERTISEMENT
Latest Stories