ఏపీ అసెంబ్లీలో మంగళవారం “లెక్కల” గోలతో హోరెత్తిపోయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలంటూ ప్రారంభించిన తన ప్రసంగానికి ముఖ్యమైన మంత్రులందరూ ఏదో ఒక సమయంలో జగన్ కౌంటర్స్ కు రిప్లై ఇచ్చారు. దీంతో జగన్ లో అసహనం కట్టలు తెచ్చుకుని, ఒకానొక సమయంలో సభ నుండి వాకౌట్ చేసారు.
తునిలో పరిశ్రమల గురించి జగన్ లేవనెత్తినప్పుడు డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పందించారు. జగన్ తూర్పుగోదావరిలో పర్యటించినప్పుడు పరిశ్రమలు వద్దని ఆందోళన చేశారని, పశ్చిమగోదావరి జిల్లా వెళ్లినప్పుడు పరిశ్రమలు కావాలంటున్నారని విమర్శించారు. బీకాంలో ఫిజిక్స్ చదివిని వాళ్లకు తన లెక్కలు అర్థం కావని జగన్ అన్నప్పుడు మంత్రి యనమల జోక్యం చేసుకున్నారు.
స్కూలుకు కానీ, కాలేజీకి కానీ వెళ్లకుండానే జగన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక నిల్వ సామర్థ్యం లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నారన్న జగన్ వ్యాఖ్యలకు దేవినేని ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై పల్లె రఘునాథరెడ్డి ఖండిస్తూ, కనీస పరిజ్ఞానం లేకుండానే జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.



