పదేళ్ల జనసేన రాజకీయ ప్రస్థానానికి 2024 ఎన్నికలలో సముచిత గౌరవం దక్కడంతో పవన్ అభిమానులలో ఒక పక్క ఆనందం మరో పక్క ఆవేదన. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలుపొంది ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జనసేన నుండి పవన్ తో కలిపి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రి పదవులు అందుకున్నారు. మొదటి సారిగా జనసేన ప్రభుత్వంలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడంతో అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పవన్ సమర్థవంతంగా పని చేస్తూ ప్రజలకు జనసేనను మరింత చేరువ చేయాలి.
పూర్తి సమయం రాజకీయాలలోనే ఉంటూ అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎదో ఒక రోజు ముఖ్యమంత్రి స్థానానికి పవన్ చేరుకోవాలని జనసైనికులు ఆశ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ తీసుకున్న అన్ని శాఖల మీద సమగ్ర సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల మీద పట్టు సాధించుకోవాలి.
పవన్ రావాలి…పాలన మారాలి అంటూ జనసేన ఇచ్చిన నినాదానికి పూర్తి న్యాయం చేయడానికి పవన్ తన పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఒక పక్క పార్టీని కార్యక్రమాలు చక్కదిద్దాలి..మరోపక్క ప్రభుత్వంలో తనదైన మార్క్ చూపించాలి.
ఇప్పుడిపుడే రాజకీయంలో తన ప్రస్థానం మొదలుపెట్టిన పవన్ గతంలో తానూ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి షూటింగ్ ల కోసం కూడా కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు సెట్స్ మీద ఉడడంతో ఎన్నికల కారణంగా వాటికీ బ్రేక్ ఇచ్చి ప్రచారంలో దూకుడు పెంచారు.
ఎన్నికలు తంతు పూర్తయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తమ హీరో మళ్ళీ మూవీస్ చేయాలంటూ పవన్ ఫాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే అటు సినిమాలలోనూ, ఇటు రాజకీయాలలోని రెండు పడవల మీద ప్రయాణం పవన్ కు ఎంత వరకు సానుకూలంగా మారుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
పవన్ కాల్ షీట్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు పవన్ ఉన్న పరిస్థితులలో తమ మూవీలలో నటించడానికి ముందుకు వస్తారా అన్న సందేహంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే తమ అభిమాన హీరోను మళ్ళీ వెండి తెర మీద చూడాలి అనుకుంటున్న పవన్ అభిమానుల ఆశలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితులలో ఫాన్స్ ఆవేదన చెందుతున్నారు.
ప్రజల ఆశలను అభిమానుల ఆవేదనను అర్ధం చేసుకుని పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో మరి. పవన్ కూడా తన పదేళ్ల పోరాటానికి తనకు ప్రజలిచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జనసేన బ్రాండ్ పెంచాలని ఆశ పడుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పవన్ తనను నమ్ముకుని కోట్ల పెట్టుబడులు పెట్టుకుని ఎదురు చూస్తున్న నిర్మాతల కోసం ముందడుగు వేస్తారా.?
లేక తన మీద నమ్మకంతో 100 % స్ట్రైక్ రేట్ తో జనసేనను ఆశీర్వదించిన ప్రజల కోసం వెనకడుగు వేస్తారో.? వేచి చూడాలి. పవన్ తీసుకునే నిర్ణయంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఇద్దరు ఆనందంగా ఉండాలి అంటే పవన్ నలిగి పోవాల్సిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి చేయకముందే వైసీపీ తన ఫేక్ ప్రచారాలకు శ్రీకారం చుట్టింది.
ఇక పవన్ అటు సినిమాల కోసం షూటింగ్లలో పాల్గొంటే వైసీపీ దుష్ప్రచారాలకు అంతే లేకుండా పోతుంది. ఎప్పటికపుడు బ్లూ మీడియా చేస్తున్న నీలి రాతలను ఖండించలేని పరిస్థితి వస్తే అవి ప్రజలలోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అది పవన్ రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగోడగా మారుతుంది.
ఇటు ప్రభుత్వంలోనూ అత్యంత కీలక శాఖలను ఎంచుకున్న పవన్ ఆ శాఖలలో తన మార్క్ పాలన ముద్ర వేసి చూపించాలి. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేస్తాడు అన్న పవన్ అభిమానుల ఆశలకు పూర్తి న్యాయం చేయాలి పవన్.ఇటువంటి రాజకీయ ఒత్తిడిదులను ఎదుర్కొంటు అటు మూవీలను ఇటు రాజకీయాలకు సమర్థవంతంగా ముందు తీసుకు వెళ్లగలిగితే పవన్ మరో మెట్టెక్కినట్టే.




