తండ్రి చాటు బిడ్డగా దేవినేని అవినాష్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలిసింది ఏమీ లేదు. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. దేవినేని నెహ్రూ మరణం తర్వాత వారసుడిగా నెహ్రూ స్థానంలోకి అవినాష్ రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనుచరులు, కార్యకర్తలకు నమ్మకం కలిగించే పనిలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్న అవినాష్, తన మనోభావాలను పంచుకునే విధంగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ‘వీకెండ్’ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతకుముందు దేవినేని నెహ్రూతో ఇంటర్వ్యూ చేసిన మీడియా ప్రతినిధే, ప్రస్తుతం అవినాష్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం.
పార్టీ కోసం మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత నారా లోకేష్ లు ఏం చెప్తే అది చేస్తామని బల్లగుద్ది చెప్పిన దేవినేని అవినాష్.., తాను నారా లోకేష్ కు ‘చెంచాగిరి’ చేస్తున్న విషయం నిజమేనని అన్నారు. నారా లోకేష్ ను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, ఆయనకున్న విజన్, ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికీ లేదని, ప్రతిపక్ష నాయకుడికి అసలు లేదని, అలాంటి నాయకుడికి ‘చెంచాగిరి’ చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చినా, లేకున్నా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతానని అన్నారు.
నిజానికి తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో నాలుగు గోడల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని, చెప్పింది ఒక్కటేనని… పదవులను ఆశించి పార్టీలోకి రాలేదని తన తండ్రి చెప్పారని, నాన్న విషయం పూర్తిగా తెలిసిన చంద్రబాబు గారు పార్టీలో తగిన విధంగా గౌరవిస్తామని తెలిపినట్లుగా చెప్పారు. అవసరమైతే తాము విడిగా నడిపిస్తున్న యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యుఎస్ఓ)ను పార్టీలో విలీనం చేయడానికి తాము సిద్ధమని, ఏది ఏమైనా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమం ఉండబోదని అన్నారు.
తన బాబాయ్ దేవినేని ఉమామహేశ్వరరావుతో ఎలాంటి విభేదాలు ఉండవని, పార్టీ కోసం వల్లభనేని వంశీతో అయినా కలిసి పనిచేయాలని చంద్రబాబు, లోకేష్ లు చెప్తే… మరో మాట ఎత్తకుండా పని చేస్తానని అన్నారు. ఇక, ‘వంగవీటి’ సినిమా కధ విషయంలో రాంగోపాల్ వర్మ తమతో చర్చించింది ఏమీ లేదని, కేవలం ఆ రోజున ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపించాము తప్ప, తమ పాత్ర హీరోగా ఉండాలని ఎలాంటి సూచనలు చేయలేదని అవినాష్ చెప్పిన వ్యాఖ్యలను పరిశీలిస్తే… అయిదేళ్లుగా రాజకీయాలలో ఉన్నా ఏమీ ఒంటపట్టించుకోలేదు అన్న ప్రచారానికి తెరదించే విధంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా తన ప్రయత్నం తాను చేసినట్లున్నారు అవినాష్.
దేవినేని నెహ్రు ఉన్న సమయంలో కేవలం స్టూడెంట్స్ వేడుకల పైనే కనిపించిన అవినాష్, ఇక నుండి రాజకీయ వేదికలపై కనిపించాల్సి ఉండడంతో, దానికి మానసికంగా సిద్ధమైనట్లుగా కనపడుతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తరహాలో తమ దొడ్లో ఎలాంటి ‘పంచాయితీలు, సెటిల్మెంట్లు’ జరగడం లేదని చెప్పిన అవినాష్, అన్యాయం జరిగిందని తమ వద్దకు వచ్చే వారికి న్యాయం చేయడం నాయకులుగా తమ బాధ్యత అంటూ పెద్ద పెద్ద మాటలే అన్నారు. అయితే ఇది కూడా పోలీసు వారి సహకారంతో అని చెప్పడం చూస్తుంటే… దేవినేని నెహ్రూ ఇచ్చిన పాత ఇంటర్వ్యూలను కాస్త ఎక్కువగానే చూసినట్లున్నారనేది పొలిటికల్ వర్గాల టాక్.



