చంద్రబాబు చేసిన ప్రాజెక్టులకి జగన్ రిబ్బన్ కటింగ్.. పైగా గొప్పలు!

Devineni Uma comments on nellore barrage inaugurated by ys Jaganసిఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై నిర్మించిన సంగం బారేజ్‌ని ప్రారంభోత్సవం చేస్తూ, ఆనాడు తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును తాను పూర్తిచేసి ప్రజలకు నీళ్ళు అందించగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాన్ని 5 ఏళ్ళపాటు పాలించిన గత టిడిపి ప్రభుత్వం సంగం బారేజ్‌ పనులు పూర్తిచేయకుండా విడిచిపెట్టేస్తే, తాను అధికారంలోకి రాగానే రూ.200 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ళలో సంగం బారేజ్‌ నిర్మాణపనులు పూర్తిచేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు తన ఆత్మీయుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడుతున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు.

దీనిపై మాజీ జలవనరుల శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ స్పందిస్తూ, “మా ప్రభుత్వ హయాంలోనే 82 శాతం పనులు పూర్తిచేస్తే, ఈ 40 నెలల్లో 10 శాతం పనులు కూడా పూర్తిచేయకుండానే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను భ్రష్టు పట్టించారు. సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు?ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం మీకుందా?” అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘రివర్స్ టెండరింగ్’ అంటూ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో సహా అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను నిలిపివేసింది. ఆ తర్వాత సంక్షేమ పధకాలు వాటి కోసం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చింది తప్ప అభివృద్ధి పనులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒకవేళ సిఎం జగన్ చెపుతున్నట్లు రాష్ట్రంలో 26 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి వాటి క్రెడిట్ పొందాలనుకొంటే వాటి గురించి నాడు-నేడులో తప్పక ప్రస్తావించి ఉండేది. కానీ ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు సంగం బారేజ్ మేమే కట్టామని గొప్పలు చెప్పుకొంటున్నారు.

అయినా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం సంగం బారేజ్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసిందంటే నమ్మశక్యంగా లేదు. కాకి లెక్కలు కాకుండా నీటిపారుదల శాఖ రికార్డులలో అసలైన లెక్కలు బయటపెట్టగలదా?అని దేవినేని ఉమ అడుగుతున్నారు. ఆయన ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా?

ADVERTISEMENT
Latest Stories