ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని కూకటివేళ్ళతో పెకలించి పడేయాలని ఈ నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. టిడిపి నేతలు, వారికి మద్దతు ఇస్తున్నవారి ఆర్ధిక మూలాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తోంది. కోర్టుల చుట్టూ తిప్పుతోంది. వైసీపీ కార్యకర్తల ముసుగులో గూండాలు వారిపై భౌతిక దాడులు చేస్తున్నారు. టిడిపి కార్యాలయాలను, వాహనాలను తగులబెడుతున్నారు.
నిజానికి ఇంతగా వేదిస్తే మరో పార్టీ అయితే ఈపాటికి కకావికలమయిపోయేదే కానీ టిడిపి మాత్రం గోడకు కొట్టిన బంతిలా మరింత దూకుడుగా వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంది. అసలు టిడిపి నేతలు చేస్తున్న పోరాటాలు, సభలు, పాదయాత్రలు, ర్యాలీలు, రోడ్ షోలతో అధికార వైసీపీ నేతలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏసీ గదులకే పరిమితమైన వైసీపీ నేతలు కనీసం గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా భయపడుతున్నారంటే వారి పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
టిడిపి నేతలు మాత్రం వైసీపీ అవినీతి, అరాచకాలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల మద్యే ఉంటున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇసుక దోపిడీని నిరసిస్తూ ‘ఇసుక సత్యాగ్రహం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని మైనింగ్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లాలో వైసీపీ నేతలు ఎక్కడెక్కడ ఎంత ఇసుక కాజేస్తున్నారో తెలియజేసేందుకు సాక్ష్యాధారాలతో సహా డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గుంటూరు జిల్లాలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజాలను ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బందం చేశారు. అద్దంకి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నాగినేని రామకృష్ణ, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడలో టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనితను, అవనిగడ్డలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ను, తిరువూరు టిడిపి ఇన్‌ఛార్జ్ దేవదత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు గృహనిర్బందం చేశారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మన ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నంత మైనింగ్ మాఫియా, దోపిడీ మరే రాష్ట్రంలోను జరుగడం లేదు. ఏపీలో ఇంత భారీగా దోపిడీ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో తెలీదు… సీబీఐ, ఈడీలు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోన్నాయో అర్దం కాదు. ఈ మాఫియాలపై కేంద్రం కొరడా ఝలిపిస్తే సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ జైళ్ళకు పోవడం ఖాయం,” అని అన్నారు.



