టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ వైసీపీ నేతలు స్వామివారి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరాలని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ అయ్యిందని ఇప్పటికే NDDB నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని, వెజిటబుల్ మరియు జంతు కొవ్వు కలిసినట్టు వెల్లడైందని తెలిపారు.
పవిత్రమైన తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఇతరులపై బురద జల్లుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధూళిపాళ్ళ విమర్శించారు. కల్తీ నెయ్యి ద్వారా అక్రమంగా వచ్చిన డబ్బు విజయవాడకు రూ.12.5 కోట్లు, చెన్నైకి రూ.7.5 కోట్లు వెళ్లిందని సిట్ వెల్లడించిందని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో వెన్న ధర రూ.360 ఉంటే రూ.316కి నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనులు వైసీపీ నాయకులేనని ఆరోపించారు.
సంగం డెయిరీ 2020, 2021లో కూడా టీటీడీ నెయ్యి టెండర్‌లో పాల్గొన్నట్టు ధూళిపాళ్ళ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి సేవ చేయాలని సంగం డెయిరీ ఎదురు చూసిందని, ఇప్పుడు ఆ అవకాశం లభించిందన్నారు. చంద్రబాబు చెప్పారని టెండర్ ఇవ్వలేదని, నిబంధనలు మరియు సాంకేతిక పరీక్షల అనంతరం టెండర్ ప్రక్రియలో పాల్గొని సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తోందని చెప్పారు. హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ కాలంలో సాక్షి పేపర్, సాక్షి ఛానల్‌కు రూ.307 కోట్ల ప్రకటనలు ఇచ్చారని ధూళిపాళ్ళ ఆరోపించారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్ల ద్వారా మూడు లక్షల టన్నులకు పైగా సిమెంట్ తీసుకున్నారని అన్నారు. తనపై వైసీపీ పెట్టిన 22 కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అవి తప్పుడు కేసులైతే ప్రభుత్వం వాటిని ఎత్తేయాలని పేర్కొన్నారు.
తనను 33 రోజుల పాటు జైలులో పెట్టి సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించారని, అణువణువూ పరిశీలించినా ఎలాంటి తప్పు దొరకలేదని ధూళిపాళ్ళ అన్నారు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల సమయంలో కూడా తాను భయపడలేదని చెప్పారు.
సంగం డెయిరీ గుంటూరు రైతులదని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని ఆయన తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించగల సామర్థ్యం సంగం డెయిరీకే ఉందని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.




