KCR

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గెలిపించిన ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రగతి భవన్ గడప దాటలేదు, అలాగే ప్రజలను ప్రగతి భవన్ గేట్ ముట్టనివ్వలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కేసీఆర్ పై విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు.

ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా కేసీఆర్ తీరు మార్చుకోవడంలేదంటూ అసెంబ్లీలో కేసీఆర్ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన విషయాల మీద చర్చ జరుగుతుంటే ఇన్నాళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన నాయకుడిగా ప్రజలకు, ఇప్పటి ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితమవ్వడం ఆయన అహంకారానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్.

తన హయాంలో నదీజలాల విషయంలో జరిగిన అవకతవకలు, రహస్య మిత్రులతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్ని బయటపడతాయి అనే భయంతోనే కేసీఆర్ కంగారు పడుతున్నారంటూ, అందుకనే అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారంటూ, ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించారా అంటూ దుయ్యబట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికార పార్టీ నేతల విమర్శలకు బలం చేకూరేలా కేసీఆర్ తీరు ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాము, కొన్ని వేల ఎకరాల భూమిని సాగుకు అందుబాటులోకి తెచ్చాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసాము అంటూ సగర్వంగా చెప్పుకున్న కేసీఆర్ ఇప్పటి అధికార పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు అసెంబ్లీ సాక్షిగా సమాధానము చెప్పి తమ ప్రభుత్వం ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకోలేదని నిరూపించుకోవాలి కదా.

గెలిచిన వారికీ ప్రశ్నించే హక్కు ఎలా అయితే వస్తుందో అలాగే ఓడిన వారికి సంజాయిషీ చెప్పాల్సిన బాధ్యత కూడా అలానే ఉంటుంది. దీని విస్మరించిన కేసీఆర్ అసెంబ్లీకి రాను, అధికార పక్షానికి ఎదుట పడను అంటూ ఎంతకాలం నెట్టుకెళ్లగలుగుతారు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అటు ప్రజలకు, ఇటు పార్టీ నేతలకు, అలాగే ప్రతిపక్షాలకు దూరంగా ఉన్నప్పటికీ అధికారం అనే కవచం కేసీఆర్ ను కాపాడుతూ వచ్చింది.

ఇప్పుడు ఆ కవచం కేసీఆర్ కు దూరమయ్యింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇదే పొరపాటు మరల చేసినట్లయితే ఉద్యమ నాయకుడిగా చరిత్ర కెక్కిన కేసీఆర్ ప్రజానాయకుడు గా మాత్రం ఎన్నటికీ చరిత్రలో నిలవలేడు అనేది గ్రహించాలి. ఓడినా, గెలిచినా రాజకీయ నాయకుల మధ్య విమర్శ, ప్రతి విమర్శ అనేది సర్వ సాధారణ విషయమే. అధికారంలో ఉన్నప్పుడు నేను నాయకుడిని, మీఅందరిని నా చేతుల మీద అసెంబ్లీకి, పార్లమెంట్ కు పంపాను.

ఆ బిఆర్ఎస్ కారు నాదే, దాని ఓనర్ నేనే, ఆ కారు స్టీరింగ్ ఎప్పుడు నాచేతిలోనే ఉంటుంది అంటూ తన పార్టీ నేతలను కట్టడి చేస్తూ ఇన్నాళ్లుగా పార్టీని ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ ఇప్పుడు కారు స్టీరింగ్ వదిలేసి రిలాక్స్ అయిపోతే కారుకి యాక్సిడెంట్ అవ్వడం, కారు చిత్తవడం తద్వారా కారు కాలికావడం కాయంగా కనపడుతుంది. పార్టీ అధినేత ఎప్పుడు తన ఉనికితో తన పార్టీ నేతలకు ఒక భరోసా, నమ్మకం కలిగించడం ఎంతో అవసరం.

2014 లో ఏపీ ముఖ్యమంత్రిగా బిజీ అయిపోయిన చంద్రబాబు కూడా ఇలానే కొన్నేళ్లు టి. టీడీపీ మీద శ్రద్ద పెట్టకపోవడంతో ఇప్పుడు అక్కడ టీడీపీ తన ఉనికి కోసం అల్లాడుతోంది. అదే పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ కి రాకముందే కేసీఆర్ మేల్కోవాలి. రానున్నరెండు నెలలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి మరో అవకాశం ఇచ్చినట్టే అవుతుంది.