రేవంత్‌ రెడ్డి అప్పుడే ప్రభుత్వంపై పట్టు సాధించారే?

Revanth Reddy

తెలంగాణలో తిరుగేలేదనుకొన్న కేసీఆర్‌ని రేవంత్‌ రెడ్డి గద్దె దించడం, కాంగ్రెస్‌ సీనియర్ల నుంచి పోటీ తట్టుకొంటూ ముఖ్యమంత్రి కావడం విశేషమే. ఈ నెల 7వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే ఇంకా నెలరోజులు కాలేదన్న మాట! కానీ కేవలం మూడు వారాలలోనే ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించడం మామూలు విషయం కాదు.

తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ, ఎంతో పరిపాలనానుభవం ఉన్నవాడిలా వివిద శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూసి ముఖ్యమంత్రి పదవి కోసం ఆయనతో పోటీ పడిన కాంగ్రెస్‌ సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు కూడా ఆయన స్పీడు చూసి చాలా సంతోషిస్తున్నారు.

ADVERTISEMENT

శాసనసభలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు, మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు ఎంతగా చెలరేగిపోయినప్పటికీ, వారి నోళ్ళు మూతపడేలా రేవంత్‌ రెడ్డి, ఆయన మంత్రులు సమాధానాలు చెప్పారు. రేవంత్‌ ప్రభుత్వం కూలిపోతుందనే వారి బెదిరింపులకి రేవంత్‌ రెడ్డి ఏమాత్రం భయపడకుండా తిరిగి వారి హయాంలో అభివృద్ధి మాటున జరిగిన అవినీతిపై న్యాయవిచారణ జరిపిస్తానంటూ ధీటుగా సమాధానం చెప్పడం ద్వారా వారిని కట్టడి చేసిన్నట్లే భావించవచ్చు.

ప్రభుత్వం కంటే పార్టీ మీద పట్టు సాధించడం చాలా ముఖ్యం. ఈవిషయంలో కూడా రేవంత్‌ రెడ్డి పట్టు సాధించిన్నట్లే ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా సీనియర్లు అందరూ ఇప్పుడు రేవంత్‌ రెడ్డిని గౌరవిస్తుండటమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ శైలికి విరుద్దంగా పార్టీలో ఎవరూ ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం గమనిస్తే పార్టీపై కూడా పట్టు సాధించిన్నట్లే కనిపిస్తున్నారు.

కనుక రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబ్బరంగా ఉండవచ్చని అర్దమవుతోంది. అయితే ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చగలరు? కేసీఆర్‌ని కాదని ప్రజలు ఆయనకి పట్టం కట్టినందుకు వారి ఆకాంక్షలు నెరవేర్చగలరా లేదా?తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపించగలరా లేదా?అనేది 2024లో తేలిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories