సీనియర్ నిర్మాత దిల్ రాజు మరో సారి మీడియా ముందుకు వచ్చారు. సోదరుడి కొడుకు సినిమా, రౌడీ బాయ్స్ కు గాలి కొట్టే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్ల సమస్య పై కూడా మాట్లాడారు.
“పాజిటివ్ గా ఉన్నాం… అన్నీ అయిపోతాయి… ఎక్కువ డిస్కషన్లు అవసరం లేదు.. అన్ని ప్రాసెస్లు జరిగిపోతున్నాయి,” అంటూ ధీమాగా చెప్పేశారు దిల్ రాజు. అయితే ఈ సమాధానం ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరచింది.
మనకు తెలీకుండా ఏమన్నా జరుగుతుందా? అనే చర్చ నడుస్తుంది. ఈ విషయంలో చివరిగా ఉన్న అప్డేట్ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలిసొచ్చారు. ఆ మీటింగ్ తరువాత చిరంజీవి మీడియా తో మాట్లాడారు.
“అతి త్వరలోనే టిక్కెట్ల విషయం పై ఓ డ్రాఫ్ట్ తయారు చేసి, దాన్ని పరిశ్రమలో అందరికీ చూపించి ఆమోదయోగ్యమైనప్పుడు దాన్ని జీవోగా ఇస్తామని జగన్ మాటిచ్చారు. ఈసారి కమిటీకి నాతో పాటు మరికొందరిని ఆహ్వానిస్తారనే అనుకుంటున్నాను. రెండు మూడు వారాల్లో కమిటీ ఫైనల్ డ్రాప్ట్ వచ్చేస్తుందని భావిస్తున్నాం’’ అన్నారు.
ఇది జరిగి పదిహేను రోజులకు పైగా అయ్యింది. సదరు కమిటీ ఇంకో మీటింగ్ కూడా పెట్టుకోలేదు. చిరంజీవి కరోనా కారణంగా ఇంటిపట్టున ఉండిపోయారు. ఇప్పటిదాకా ఛాంబర్ కు ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి ఆహ్వానం రాలేదు.
గత హై కోర్టు హియరింగ్ లో ఈ ఇష్యూ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ నెక్స్ట్ హియరింగ్ (ఫిబ్రవరి 11న) దాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తున్న స్పీడ్ కు అది కూడా అనుమానంగా మారింది.
ఊరికే పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతున్నాం అని కోర్టుని మరింత సమయం అడిగి ఈ సమస్యను పక్కన పెడుతుందా అనే అనుమానాలు అంతటా ఉన్నాయి. ఈ తరుణంలో దిల్ రాజు “అన్నీ అయిపోతాయి… ఎక్కువ డిస్కషన్లు అవసరం లేదు.. అన్ని ప్రాసెస్లు జరిగిపోతున్నాయి” అని చెప్పడం పరిశ్రమ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి.



