టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి కాంభినేషన్ ఈ నెల 24వ తేదీన కార్యరూపం సిద్ధించుకోబోతోంది. ధోని జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో… ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ఆడియో విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
ఈ వేడుక కోసమే రాజమౌళి – ధోని ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లో రాజమౌళి చేతుల మీదుగా ‘ఎంఎస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ తెలుగు ఆడియో విడుదల కానుంది. గతంలో త్రివిక్రమ్ తో కలిసి ఓ యాడ్ లో భాగస్వామి అయిన ధోని, మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ తెలుగు దర్శకుడిని కలవబోతున్నారు. అది కూడా ‘బాహుబలి’ ద్వారా ప్రపంచ ఖ్యాతి పొందిన జక్కన్నతో కావడం మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది.



