క్రియేటివిటీకు మారు పేరు సుకుమార్. తెలుగు సినిమా గమనాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళే సుకుమార్, ఈ ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తన తదుపరి చిత్రంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోతోందని ఇటీవల సుకుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది.
కనీసం ఏడాది పాటు షూటింగ్ చేయనిదే సినిమాను పూర్తి చేయని సుకుమార్, ఈ సినిమాను మాత్రం అక్టోబర్ లో ప్రారంభించి ఫిబ్రవరిలో విడుదల చేస్తానంటున్నారు. నిజంగా ఇది జరిగితే ఒక సంచలనమే అని చెప్పాలి. ‘1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ సినిమాలను దాదాపు ఒక ఏడాది పాటు షూట్ చేసిన సుక్కూ వ్యాఖ్యలు నిజమేనా? అన్న రీతిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ’ సినిమా అక్టోబర్ తొలి వారంలో విడుదల కాగానే, చెర్రీ – సుక్కూల కాంభినేషన్ సెట్స్ పైకి వెళ్తోంది.
ఇటీవల కాలంలో ఇంత తక్కువ సమయంలో షూటింగ్ చేసుకుని విడుదలైన పెద్ద సినిమాలుగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు, బిజినెస్ మెన్’ చిత్రాలు నిలిచాయి. ఆ రెండూ కూడా పూరీ దర్శకత్వం వహించినవే. ఒకవేళ సుకుమార్ కూడా అంతే జెట్ స్పీడ్ లో దూసుకువెళితే, పూరీ తర్వాత ఆ క్రెడిట్ సుక్కూకే దక్కుతుంది. మరి ఆ రికార్డును సుకుమార్ అందుకోవాలని ఆశిద్దాం.



