కొందరు దర్శకులతో చేయాలని స్టార్ హీరోలకు బలంగా ఉంటుంది కానీ కమర్షియల్ కోణంలో అవి వర్కౌట్ కాకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయి. ఉదాహరణకు చిరంజీవి భారతిరాజా ఒకే ఒక కలయిక ఆరాధన బాక్సాఫీస్ వద్ద డిజాస్టరయ్యింది. కె విశ్వనాథ్ తో బాలకృష్ణ చేసిన జననీ జన్మభూమి సినిమా బాగున్నా కనీస మేజిక్ చేయలేకపోయింది. మణిరత్నంతో నాగార్జున చేసిన గీతాంజలి శివ రేంజ్ ఇండస్ట్రీ హిట్ అయితే కాదు. అందుకే ఇప్పటి జనరేషన్ హీరోలు ఇలాంటి ప్రయోగాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడీ ప్రస్తావనకు కారణం వెట్రిమారన్. ఈయన తీసే సినిమాలు రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. అంటే నేపధ్యాన్ని చాలా బలంగా హృదయాన్ని మెలితిప్పేలా చూపిస్తారు. మొదటి చిత్రం నుంచి ఇదే శైలి. ఇటీవలే తమిళంలో రిలీజై తెలుగులో శనివారం రాబోతున్న విడుదల పార్ట్ 1 ని మరీ బోల్డ్ గా సన్నివేశాలు వెంటాడేలా తీశారు. హైదరాబాద్ లో ప్రీమియర్ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి టాలీవుడ్ స్టార్లతో చేయాలనుకున్న చేయబోతున్న ప్లాన్ల గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి వెట్రిమారన్ టేస్ట్ మన ఆడియన్స్ కి అంతగా సింక్ అవ్వదు. ధనుష్ పందెం కోళ్లు ఒరిజినల్ వెర్షన్ ఆడుకాలంని ఇక్కడ కనీసం ఎవరూ పట్టించుకోలేదు. వడ చెన్నైని డబ్బింగ్ చేసే సాహసం చేయలేదు. అసురన్ ని వెంకటేష్ తో రీమేక్ చేస్తే సురేష్ బాబు ఆడదేమోనని అనుమానం వచ్చి కరోనా సీజన్ పేరుతో ఓటిటికి ఇచ్చారు. ఇవన్నీ తమిళనాడులో బ్రహ్మాండంగా ఆడినవి. ఈ తరహా డ్రామా వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఈయనతో పాటు పా రంజిత్ మేకింగ్ మన ప్రేక్షకులకు అంతగా జీర్ణం కాదు.
తారక్ కావొచ్చు మరొకరు కావొచ్చు. వెట్రిమారన్ ఎవరితో చేసినా లాభం కన్నా రిస్కే ఎక్కువ. ఎందుకంటే అతను ఎట్టి పరిస్థితుల్లో మాస్ సూత్రాలను పట్టించుకోడు. కేవలం సబ్జెక్టుకే కట్టుబడతాడు. దానికి ఒప్పుకుంటేనే తీస్తాడు తప్పించి ఓ వంద కోట్ల మార్కెట్ ఉంది కదాని తన మనస్తత్వానికి భిన్నంగా ఆలోచన చేయడు ఆచరణలో పెట్టడు. క్రిష్ వేదంలో అల్లు అర్జున్ ని చాలా విభిన్నంగా చూపిస్తే ఆది క్లాసిక్ అయ్యిందే తప్ప సూపర్ హిట్ కాలేకపోయింది. మన జనాల సెన్సిబిలిటీస్ వేరు. వెట్రిమారన్ లాంటి దర్శకుల ఆలోచనా ధోరణి వేరు. రెండు సింక్ కావడం అంత సులభం కాదు. అయినా సరే వెట్రిమారన్ తెలుగులో సినిమా తీస్తే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గదే.



