బలపరీక్ష కోసం బరిలోకి దిగిన పళనిస్వామి ప్రభుత్వానికి పన్నీర్ మరియు స్టాలిన్ వర్గం చుక్కలు చూపించారు. ఆ మాటకొస్తే పళనిస్వామి వర్గీయుల కంటే ఎక్కువగా స్పీకర్ ఈ ఉదంతంలో ఇబ్బందులు పడ్డారు. సీక్రెట్ ఓటింగ్ జరపాలని కోరిన పన్నీర్ మరియు స్టాలిన్ భావాలను తోసిపుచ్చిన స్పీకర్, ఓటింగ్ ఎలా జరపాలో తనకు తెలుసని, మీరు చెప్పేది నేను పాటించనని, ఏం చేయాలో తనకు తెలుసని, కాస్త గట్టిగానే జవాబిస్తూ ‘హెడ్ కౌంటింగ్’ జరపాల్సిందిగా తీర్మానించారు.
అందుకు అనుగుణంగానే ఒక డివిజన్ లెక్కించగా, పూర్తిగా పళనిస్వామికి మెజారిటీ వస్తూ 38 మంది జై కొట్టడంతో ఆగ్రహించిన డిఎంకే నేతలు మరియు పన్నీర్ వర్గం సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రజాబలం తెలుసుకున్న బలపరీక్ష చేపట్టాలని పన్నీర్ కోరగా, సీక్రెట్ ఓటింగ్ చేసే స్వేఛ్చను ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందిగా స్టాలిన్ కోరారు. ఈ సందర్భంగా ఇరువర్గాల ఆధిపత్య పోరులో స్పీకర్ నలిగిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఓ మినీ యుద్ధ వాతావరణమే నెలకొంది.
పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని భావించిన స్పీకర్ మీడియాను నియత్రించడంతో పాటు మీడియా రూమ్ లో ఉన్న ఆడియో స్పీకర్ ను సైతం కట్ చేయించారు. దీంతో అసెంబ్లీ లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలియని పరిస్థితి. అయితే… మీడియా వర్గీయులకు అందుతున్న ‘ఉప్పు’ ప్రకారం… డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతూ… స్పీకర్ పోడియంను చుట్టుముట్టడమే కాకుండా, స్పీకర్ పైకి కుర్చీలను విసిరారు. స్పీకర్ టేబుల్ పైకి ఎక్కి, పేపర్లను చింపి ఆయన మీదకు విసిరేశారు.
ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై విజువల్స్ విడుదలయ్యాయి. స్పీకర్ పోడియంలోకి దూసుకువచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్‌లో కూర్చోవడానికి క్యూ కట్టినట్లు నిలబడ్డారు. ముందుగా స్పీకర్ చైర్‌లో డీఎంకే ఎమ్మెల్యే కువ్వా ఆసీనులు కాగా, అనంతరం నవ్వుతూ వచ్చిన మరో డీఎంకే నేత కూడా స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడుతూ… తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే తాను సభ నిర్వహిస్తున్నానని, చొక్కా చింపి తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేసారు.
అయితే ఈ వ్యాఖ్యల తర్వాత కూడా శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, . డీఎంకే సభ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, స్పీకర్ ధన్ పాల్ సభను మరోసారి మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. మొదట డివిజన్ ఓటింగ్ కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేస్తూ స్పీకర్ అక్కడ నుండి వెళ్ళిపోయారు.



