
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఉదయం 5 గంటల నుంచే తలుపులు తట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేస్తుండటంతో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు.
Also Read – సైన్యానికి పూర్తి స్వేచ్ఛ…దేనికి సంకేతం..?
టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీస్తుందని, పింఛన్లు ఇవ్వదని ఎన్నికల సమయంలో జగన్ దుష్ప్రచారం చేసేవారు. కనుక పింఛన్ విషయంలో ప్రజలు సందేహపడుతుండేవారు.
కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టగానే మొట్ట మొదట అదే ఫైల్‌పై సంతకం చేసి, పెంచిన మొత్తానికిగాను మూడు నెలల బకాయిలతో కలిపి మొదటి నెలలోనే రూ.7,000 చెల్లించారు. మళ్ళీ ఈ నెల 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నారు.
Also Read – పాకిస్థాన్‌కు ఓ యుద్ధం కావాలి.. భారత్ చేస్తుందా?
ఇది చాలా సంతోషించాల్సిన విషయమే. అయితే కేవలం అర్హులకు మాత్రమే పింఛన్ చెల్లించాలి తప్ప అనర్హులకి కాదు. సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్న కొన్ని ఫోటోలు, సూచనలను చూస్తే ఇది అర్దమవుతుంది.
ప్రజల చేత మంచి అనిపించుకోవడం కోసం అనర్హులకి కూడా పంచిపెడితే ప్రభుత్వంపై ఆర్ధికభారం పెరుగుతుంది. దానిని సర్దుబాటు చేసుకోవడానికి మళ్ళీ ప్రజలపై ఆ భారం మోపాల్సివస్తుంది. అదే కనుక జరిగితే వైసీపి చేసిన తప్పే టిడిపి కూటమి ప్రభుత్వం కూడా చేసిన్నట్లవుతుంది కదా?
Also Read – ఫీజుల పెంపు పై చట్టం…హర్షిది’రేఖా’లు.!
ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేద రైతులు పంటలు వేసుకునే ముందు విత్తనాలు, ఎరువులు వగైరా కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బు తెచ్చుకుని తర్వాత ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారి కోసం రైతు భరోసా పధకం ప్రారంభించారు. ఏడాదిలో రెండు పంటలకు కలిపి ఎకరానికి పదివేలు చొప్పున ఇచ్చేవారు.
అయితే అది పేదరైతులకు పరిమితం చేయకుండా వందలు, వేల కోట్ల ఆస్తులు కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లకు, సినీ నటులు, భూస్వాములకు, చివరికి కొండలు గుట్టలు ఉన్నవారి కూడ్డా దీనిని వర్తింపజేయడంతో ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడేది.
కానీ కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. కనుక ఈ పధకం కేసీఆర్‌కు ఎంత మంచి పేరు తెచ్చిందో అంతే చెడ్డ పేరు కూడా తెచ్చింది.
అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 5 ఎకరాలలో లోపు ఉన్నవారికి, నిజంగా వ్యవసాయం చేస్తున్నవారికి మాత్రమే ఈ పధకాన్ని వర్తింపజేస్తోంది. అంటే ఏపీలో పింఛన్ల విషయంలో కూడా అర్హులను గుర్తించడం చాలా అవసరమన్న మాట!
పింఛన్ ఉదయం 5 గంటల నుంచే చెల్లించాలనే జగన్ విధానాన్ని టిడిపి కూటమి ప్రభుత్వం గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదు. దీని వలన అందరికీ ఇబ్బందే తప్ప మరో ప్రయోజనం లేదు. కనుక నెలనెలా సకాలంలో పింఛన్లు అందించడమే ముఖ్యం.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు వెళ్ళి ప్రజలను పలకరించి పింఛన్ అందించడం చాలా మంచి ఆలోచనే. కానీ వైసీపి నేతల్లా నోటి దురుసు, ఓవర్ యాక్షన్ చేయకుండా మర్యాదగా, హుందాగా, ఆప్యాయంగా పలకరింపులతో ఈ కార్యక్రమం జరిగేలా చూసుకోవడం చాలా అవసరం. లేకుంటే దీంతో కొత్త సమస్యలు పుట్టుకువచ్చే ప్రమాదం ఉంటుంది.