తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయట విలేఖరులతో మాట్లాడుతూ, “ఏపీలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నానని అన్నారు.
కేసీఆర్, జగన్‌ల మద్య సత్సంబంధాలున్నప్పటికీ విభజన సమస్యలు పరిష్కరించుకోలేకపోయారు. కనుక రేవంత్ రెడ్డి-జగన్ మద్య సత్సంబంధాలు అసాధ్యం.
Also Read – భయపడొద్దని జగన్ చెపుతున్నా సజ్జల వినరే…
ఒకవేళ సత్సంబంధాలు అవసరమని జగన్ భావించి ఉంటే రేవంత్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అభినందించి ఉండాలి లేదా కేసీఆర్‌ని పరామర్శించడానికి హైదరాబాద్ వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఉండవచ్చు. కానీ రెండూ చేయలేదు.
ఎందుకంటే కేసీఆర్, జగన్‌లకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉమ్మడి శత్రువులు కనుక! ఈ నేపధ్యంలో ఏపీలో ‘కొత్త ప్రభుత్వంతో’ సత్సంబంధాలు ఏర్పడాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం యాదృచ్ఛికంగా అన్న మాట కాదు. కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు అంటే వైసీపి ప్రభుత్వం కాదని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతోనే అని వేరే చెప్పక్కరలేదు.
Also Read – అప్పుడు బిఆర్ఎస్ మౌనం… ఇప్పుడు టిడిపి!
అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని రేవంత్ రెడ్డి కూడా చెప్పేశారన్న మాట!విభజన సమస్యల పరిష్కారం గురించి అవసరమైన చర్యలు, చర్చలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు కూడా.
చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డికి మద్య రాజకీయ సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరూ వీటి పరిష్కారానికి ప్రయత్నించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read – బిఆర్ఎస్ కు అస్త్రాలన్నీ కాంగ్రెసే ఇవ్వనుందా.?
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఇంకా అనేక అంశాలు, సమస్యలలో పరస్పర సహాయసహకారాలు చాలా అవసరం ఉంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కేసీఆర్, బీజేపీ నేతలు కాసుకు కూర్చున్నారు. ఇప్పుడు టిడిపితో బీజేపీ కలిసి సాగుతోంది. అదేవిదంగా కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే దానిలో టిడిపి కూడా భాగస్వామిగా ఉంటుంది.
ఇదీగాక తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి సమస్యలు సృష్టించకుండా ఉండరు.
కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చంద్రబాబు నాయుడుకి కూడా చాలా అవసరమే. కనుక రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ, కేసీఆర్ వలన నష్టం కలగకుండా చంద్రబాబు నాయుడు ఓ కాపు కాస్తారనే భావించవచ్చు. కనుక చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి కూడా సత్సంబంధాలు కొనసాగించడం ఖాయమే.
రెండు రాష్ట్రాలలో అధికార పార్టీల (బిఆర్ఎస్-వైసీపి) మద్య ఎంత సత్సంబంధాలు ఉన్నప్పటికీ అవి రాష్ట్రాలకు ఏమాత్రం ఉపయోగపడవని గత 5 ఏళ్ళలోనే తేలిపోయింది.
అదే… రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు ఏర్పడి అవి బలపడితే, రెండు రాష్ట్రాలు, ప్రజలకు కూడా లబ్ధి కలుగుతుంది. ఏపీకి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు అత్యవసరంగా రప్పించుకోవలసి ఉంటుంది. హైదరాబాద్-అమరావతిల మద్య ‘రాజకీయ కనెక్షన్’ ఏర్పడితే ఇది మరింత సులభతరం అవుతుంది.
కానీ చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి మద్య సత్సంబంధాలు, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడితే, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ రాజకీయంగా మళ్ళీ పుంజుకోలేక బలహీనపడే ప్రమాదం కూడా ఉంటుంది.
కనుక రేవంత్ రెడ్డి తెలంగాణను మళ్ళీ ఏపీలో కలిపేస్తారనో లేదా తెలంగాణను చంద్రబాబు నాయుడుకి దోచిపెట్టేస్తున్నారని కేసీఆర్, అలాగే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో దోస్తీ కోసం ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని జగన్ సైంటిమెంట్ సెగలు రాజేయకుండా ఉండరు.
కనుక ఏపీ, తెలంగాణల మద్య సత్సంబంధాలు నెలకొల్పడం చాలా కష్టమే. కానీ ఈ సమస్యలు, అవరోధాలు అన్నిటినీ అధిగమించి సత్సంబంధాలు ఏర్పరచుకోగలిగితే అది రెండు రాష్ట్రాలలో రాజకీయ సుస్థిరతకు, తద్వారా అభివృద్ధికి చాలా దోహదపడుతుంది.