హైడ్రాతో ఒక్కసారిగా హైద్రాబాద్ వాసులతో సహా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను, మీడియాను తన వైపు తిప్పుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన రేవంత్ సర్కార్ హైడ్రా ఆట మూసి సుందరీకరణ వద్దకు వచ్చి ఆగింది.
అయితే హైడ్రా ఇప్పుడు గతం మాదిరి దుందుడుకుగా ముందుకు వెళ్లలేకపోతుంది. దీనికి అక్కడ ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వస్తున్న తీవ్ర వ్యతిరేకత ఒక కారణం అయితే, వీరంతా కూడా తమ ఆస్తుల రక్షణకు, ప్రభుత్వం మీద పోరాటానికి ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సాయం కోరడం మరో కారణం గా చెప్పవచ్చు.
జీవితకాల కష్టం కళ్ళ ముందు కూలిపోతుంటే, వాటిని ఎలా రక్షించుకోవాలో తెలియక, ఎవరికి నిందించాలో తోచక, ఎవరిని సాయమడగాలో అర్ధం కాకా, ప్రభుత్వంతో పోరాడే శక్తి లేని సామాన్యుడి కన్నీటి ఆక్రందనలు మిన్నంటాయి. వాటికి కూడా చెలించని కాంగ్రెస్ ప్రభుత్వం, స్పందించని సీఎం రేవంత్ మూసి తీర ప్రాంతానికి వచ్చేసరికి వెనకడుగు వేశారు.
సున్నపు చెరువు, దుండిగల్ లోని మల్లం పేట, వేముల వాడ, పటేల్ గూడా, మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్క్ ఇలా అనేక ప్రాంతాలలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్లింది, అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేయగలిగింది.
అయితే ఆయా ప్రాంతంలో బాధితులుగా రోడ్డుపాలైన వారు మాత్రం తమకు ప్రభుత్వం ఎటువంటి పునరావాసాన్ని కానీ, ఆర్థిక సాయాన్ని కానీ ప్రకటించకుండానే ఇలా ఉన్న పళంగా కూల్చివేతలకు ఆదేశాలు ఇవ్వడం అమానుషం అంటూ రేవంత్ సర్కార్ మీద మండిపడ్డారు.
అలాగే మూసి సుందరీకరణ పేరుతో ఆయా ప్రాంతాల అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, అక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, లేదంటే స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి తగిన ఆర్థిక సాయమందిస్తామని హామీలు గుప్పించిన మూసి ప్రజలను ఒప్పించలేకపోయింది రేవంత్ సర్కార్.
అలాగే బిఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి కి సంబంధించిన ఆస్తులు కూడా ఈ అక్రమ నిర్మాణాల జాబితాలో పేరు నమోదు చేసుకున్నాయని, ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా చెరువుని ఆక్రమించి నిర్మించిన ఒక అక్రమ కట్టడమే అని, ఇక పాత బస్తి మోనార్కులుగా చెప్పబడే ఎంఐఎం ఒవైసీకి సంబందించిన ఫాతిమా కాలేజీ నిర్మాణాలు సైతం అక్రమ నిర్మాణాలే అంటూ ప్రచారం జరిగింది.
అలాగే వాటికి కూడా త్వరలో హైడ్రా ట్రీట్మెంట్ తప్పదు అంటూ ఊకదంపుడు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేతలు కానీ, హైడ్రా అధికారులు కానీ ఇప్పటి వరకు ఆ ఆస్తుల జోలికి వెళ్లే సాహసం కూడా చేయలేకపోయారు. అంటే పోరాటం చెయ్యలేని పేదవాడి మీదేనా ప్రభుత్వ జులుం, ఓటేసి ఎన్నుకున్న వాడికైనా వెన్నుపోటు అంటూ హైడ్రా బాధితులు రేవంత్ సర్కారు ను నిలదీస్తున్నారు.
పునరావాసం కల్పిస్తాము అన్నా కూడా ఒప్పుకొని ప్రాంతాల ప్రజలకు ఒక న్యాయం, కనీసం పునరావాసం చూసుకునే సమయం ఇవ్వండి అంటూ వేడుకున్న ప్రాంతాల ప్రజలకు మాత్రం ఇంత అన్యాయమా.? అనే ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు బదులివ్వాలి. అప్పుడు సునామి మాదిరి ఒక్కసారిగా వచ్చి కూల్చివేతలతో విరుచుకు పడిన హైడ్రా ఇప్పుడు సప్పుడు చేయకపోవడంతో హైడ్రా ఇక ముగిసిన అధ్యాయమేనా.? అనే సందేహం కలుగుతుంది.




