మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి కి ఇంకా చంద్రబాబు నాయుడు ఫోబియా పోయినట్టుగా లేదేమో బహుశా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన ప్రభుత్వ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన నిస్సహాయతను వ్యక్తపరచడానికి బాబు ను బూచి గా చూపించించి డైవెర్షన్ రాజకీయాలు నడిపేవారు జగన్.
తన తండ్రి చావుకి న్యాయం చేయండి అంటూ వివేకా కుమార్తె వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను సునీత పై టీడీపీ ముద్ర వేసేసారు జగన్. సునీత, బాబు ట్రాప్లో పడి నన్ను, నా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుందంటూ దీనికంతటికి చంద్రబాబే కారణమంటూ నేరం మొత్తం బాబు పై నెట్టి చేతులు దులుపుకున్నారు పులివెందుల ఎమ్మెల్యే గారు.
ఇక తన తల్లి, చెల్లితో వచ్చిన కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల పంచాయితీలు, కోర్ట్ తగాదాలు, షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం, ఆపై వైసీపీ ని వైస్ జగన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం దీనికంతటికి కూడా బాబే కారణమంటూ బుకాయించే ప్రయత్నం చేసారు జగన్. చివరికి చెల్లి పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుని నాడు జగన్ సమాజం ముందు పలుచనయ్యారు.
కుటుంబాలను విడదీసే రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు, షర్మిల చంద్రబాబు బుట్టలో పడింది, వీరంతా కూడా ఇప్పుడు బాబు మనుషులే అంటూ గత ఎన్నికల ప్రచారంలో నానా హంగామా చేసారు జగన్. అయితే దీనికి కౌంటర్ గా షర్మిల తన అన్నకు బాబు ఫోబియా పట్టుకుందని, జగన్ అద్దంలో తన ముఖం చూసుకున్న ఆయనకు బాబే కనిపిస్తున్నదంటూ జగన్ ను ఒక రేంజ్ లో వేసుకున్నారు.
అయితే తాజాగా జగన్ పెట్టిన ప్రెస్ మీట్ వింటే షర్మిల విమర్శలలో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదేమో అనిపిస్తుంది. వైసీపీ మాజీ ఎంపీ, జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ జైల్మేట్ అయిన విజయసాయిరెడ్డి మీద కూడా జగన్ ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఆయనకున్న బాబు ఫోబియోను మరోసారి బయటపెట్టుకున్నారు.
మరోమూడేళ్ల పాటు రాజ్యసభ అవకాశం ఉన్నప్పటికీ సాయి రెడ్డి బాబు కు లొంగిపోయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారని, సాయి రెడ్డి కూడా బాబు మనిషిగా మారిపోయారంటూ ఆరోపణలు చేసారు. అయితే జగన్ తన సొంత కుటుంబ సభ్యులను, తనకు అత్యున్నత సన్నిహితులను కూడా ఇలా బాబు మనుషులు అంటూ ఆరోపించడం, టీడీపీ పార్టీ తో ముడిపెడుతూ విమర్శలు చేయడం ఆయన చేతకాని తనం కాదా.? అనేది గ్రహించలేకపోతున్నారు.
తన సొంత కుటుంబ సభ్యులే జగన్ ను కాదని బయటకొస్తూ, జగన్ రాజకీయ పతనం కోసం ఎదురు చూస్తున్నారు అంటే వైసీపీ రాజకీయం ఎంత నీచంగా ఉంటుందో, యిట్టె అర్ధమవుతుంది. అలాగే వైస్సార్ మరణం దగ్గర నుంచి నేటి వరకు జగన్ కు కుడి భుజం మాదిరి, వైసీపీ ఫ్యాన్ కి రెగ్యులేటర్ మాదిరి పని చేసిన విజయసాయి సైతం జగన్ రాజకీయం ముందు నిలవలేకపోయారు అంటే జగన్ విలువలు, విశ్వసనీయత ఏపాటివో అవగతం అవుతుంది.
నిజంగా జగన్ ఆరోపిస్తున్నట్టుగా అటు షర్మిల కానీ ఇటు సాయి రెడ్డి కానీ బాబు మనుషులైతే ఈ పాటికే షర్మిల ద్వారా పులివెందుల గండికోట రహస్యాలు ఎప్పుడో బయటకొచ్చేసేవి. అలాగే సాయి రెడ్డి సాయంతో వైసీపీ లోగుట్టు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడేవి. ఇప్పటికైనా జగన్ ఈ బాబు ఫోబియా తో బాధపడుతూ తన అసమర్ధతను ఇలా బాబు పై నెట్టి తన పార్టీ క్యాడర్ ను, లీడర్లను మభ్య పెట్టడం మానుకుంటే మంచిదేమో..!




