వైసీపీలో రామచంద్రాపురం టికెట్ పంచాయితీ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈరోజు విజయవాడలో జిల్లా ఇన్‌ఛార్జ్ మిథున్ రెడ్డితో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశమైనప్పుడు ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నించగా, మంత్రి వేణుగోపాల్ కృష్ణతో రాజీ, చర్చలు తనకు అవసరం లేదని, ఆయన కాలు కింద చెప్పులా పడి ఉండాల్సిన అవసరం తనకు లేదని ఖరాఖండీగా చెప్పేశారు.
ఒకవేళ రామచంద్రాపురం టికెట్ తన కుమారుడు సూర్యప్రకాష్‌కు ఇవ్వకపోతే తాము పార్టీ వీడటం, అక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుండబద్దలు కొట్టేసి తిరిగివచ్చేశారు.
అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి వేణుగోపాల్ కృష్ణ వైపే మొగ్గు చూపుతున్నట్లు మిధున్ రెడ్డి మాటలలో స్పష్టమైనందునే పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడేందుకు సిద్దమని ప్రకటించిన్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం ఎవరూ సిఎం జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయలేరని చేస్తే సహించబోరని మిధున్ రెడ్డి చెప్పిన్నట్లు తెలుస్తోంది. కనుక పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీని వీడటం ఖాయమే. అయితే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా వైసీపీలో సాగుతున్న ఈ పంచాయితీని టిడిపి, జనసేనలు నిశితంగా గమనిస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడేందుకు సిద్దమని బహిరంగంగా చెప్పేయడంతో రెండు పార్టీలకు చెందిన నేతలు వేర్వేరుగా ఆయనని కలిశారు.
ముందుగా టిడిపి సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కొందరు ఆయన నివాసానికి వెళ్ళి సుదీర్గంగా చర్చించి టిడిపిలోకి ఆహ్వానించారు. వారి తర్వాత జనసేనకు చెందిన నేతలు వెళ్ళి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు.
రెంటిలో ఆయన జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఇంకా ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. గోడ మీద కూర్చోన్న పిల్లి ఎటో అటు దూకడం ఖాయమే. కానీ ఎటువైపు అనేదే ప్రశ్న.



