ఎదురుదాడులు చేస్తారు కానీ సమాధానం చెప్పరా?

Pawan Kalyanజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ల వ్యవస్థపై కొన్ని నిశిత విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు, సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులందరూ వాటికి నేరుగా సమాధానాలు చెప్పకుండా ‘ముగ్గురు, నలుగురు పెళ్ళాలు’ అంటూ ఆయన వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు.

తద్వారా పవన్‌ కళ్యాణ్‌ మానసికంగా దెబ్బ తీసి నోరు మూయించాలని ప్రయత్నించిన్నట్లు అర్దమవుతోంది. కానీ రాష్ట్రంలో వేలాదిమంది మహిళలు అదృశ్యం అవడం గురించి పవన్‌ కళ్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పనేలేదు.

ADVERTISEMENT

ప్రతిపక్ష నాయకులకు ఏదో కుంటిసాకులతో నోటీసులు పంపించే రాష్ట్ర మహిళా కమీషన్‌ కూడా మహిళల అదృశ్యంపై పవన్‌ కళ్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. అంటే రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతుండటం నిజమని కానీ వైసీపీ ప్రభుత్వం వద్ద పవన్‌ ప్రశ్నలకు సమాధానాలు లేవని అర్దమవుతోంది.

ఏపీలో బాలికలు, మహిళలు అదృశ్యం అవుతుండటంపై రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్‌ మిశ్రా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దానిలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 30,196 మహిళలు కనబడకుండాపోయారని, వారిలో 18 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న మైనర్ బాలికలు 7,918 మంది ఉన్నారని తెలిపారు.

కేంద్ర సహాయమంత్రి చెప్పిన విషయాన్నే ప్రస్తావిస్తూ, “ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అదృశ్యం అవుతున్న మహిళలు, బాలికల సంఖ్య నానాటికీ పెరుగుతోందని కేంద్రం ప్రకటిస్తున్న ఈ గణాంకాలను బట్టి అర్దమవుతోంది. రాష్ట్రంలో ఇంతమంది మహిళలు, బాలికలు ఎందుకు అదృశ్యమవుతున్నారు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారు?వారి పరిస్థితి ఏమిటి? దీనికి ఎవరు బాధ్యత వహించాలి?

ఏపీ మహిళా కమీషన్‌ ఈ సమస్య గురించి రేపు ప్రెస్‌మీట్‌ పెట్టి వివరణ ఇవ్వగలదా? రాష్ట్ర హోంమంత్రిని రాష్ట్ర డిజిపిని సంజాయిషీ కోరగలదా?ఇప్పటికైనా ఏపీ మహిళా కమీషన్‌ మేల్కొని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగగలదా?ఈ సమస్యపై రాష్ట్ర హోంమంత్రి , డిజిపి స్పందించాలని జనసేన కోరుతోంది,” అని పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేస్తూ ‘మేలుకో ఏపీ మహిళా కమీషన్‌’ అంటూ హ్యాష్ ట్యాగ్‌ కూడా పెట్టారు.

వాలంటీర్లను అనుమానిస్తూ, అవమానిస్తున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారని ఆరోపిస్తూ వాలంటీర్ల చేత వైసీపీ రోడ్లపై ధర్నాలు చేయించింది. పవన్‌ కళ్యాణ్‌ దిష్టి బొమ్మలు దగ్ధం చేయించింది. కోర్టులో కేసు కూడా వేయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమైంది.

వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్‌ కళ్యాణ్‌ వాస్తవాలు మాట్లాడితేనే ఇంత హడావుడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, మరి రాష్ట్రంలో 30,196 మహిళలు కనబడకుండాపోతే ఇంకెన్ని చర్యలు తీసుకొని ఉండాలి?

రాష్ట్రంలో ఇంతమంది మహిళలు అదృశ్యమవుతున్న సంగతి అసలు మహిళా కమీషన్‌కు అసలు తెలుసా?తెలియదా? రాష్ట్రానికి హోంమంత్రిగా తానేటి వనిత ఉన్నారు. ఈ సమస్యపై ఓ మహిళగా ఆమె ఏం సమాధానం చెపుతారు?

ADVERTISEMENT
Latest Stories