donald-trump Decisions Effects World Economy

డొనాల్డ్ ట్రంప్‌ మొదట వ్యాపారవేత్త ఆ తర్వాతే రాజకీయ నాయకుడుగా మారారు. కనుక అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినా ఆయనలో ఆ వ్యాపార లక్షణాలు అలాగే పదిలంగా ఉన్నాయి.

అందుకే అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదట కెనడాపై తర్వాత యూరోపియన్ దేశాలపై, ఇప్పుడు భారత్‌, చైనాలపై భారీగా వాణిజ్య సుంకాలు విధించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 2 నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తాయని ముహూర్తం కూడా ప్రకటించేశారు.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు ఎంత సుంకం విధిస్తే వాటి ఉత్పత్తులపై కూడా అమెరికా అంతే సుంకం విధిస్తుందని డోనాల్డ్ ట్రంప్‌ నిన్న కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో చెప్పారు.

తద్వారా అమెరికా ఆదాయం భారీగా పెరుగుతుందని ట్రంప్‌ అన్నారు. అమెరికా దేశం, ఆమెరికన్ల సంక్షేమం కోసం ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోనని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

అమెరికా దేశాధ్యక్షుడుగా ఆయన తన దేశవ్యాప్తంగా హితం కోసం ఎటువంటి నిర్ణయాలైన తీసుకోవచ్చు. దానిని ఎవరూ వేలెత్తి చూపలేరు.

గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి హటాత్తుగా అమెరికా సైన్యాన్ని ఉపసంహరించి, వారి ప్రాణాలను కాపాడారని ఆమెరికన్స్ చాలా సంతోషించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశ భద్రత కోసం అమెరికా సైనికులు ఎందుకు ప్రాణాలు పణంగా పెట్టాలి?ఆ దేశ భద్రత కోసం అమెరికన్ల కష్టార్జితం ఎందుకు ఖర్చు చేయాలనే ట్రంప్‌ వాదనలను సగటు ఆమెరికన్స్ అందరూ సమర్ధించారు.

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!

అయితే ట్రంప్‌ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ఏ తాలిబన్లతో అమెరికా సైనికులు దశాబ్ధాలుగా పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నారో, వారి చేతికే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అప్పగించేసి తిరిగి వచ్చేశారు.

అప్పటి నుంచి తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. అంటే నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే ట్రంప్‌ నిర్ణయానికి మంచి, చెడు జరిగాయన్న మాట!

ఇప్పుడు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచి అమెరికాకు భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని ట్రంప్‌ అనుకుంటున్నారు.

కానీ ఏ ఉత్పత్తికైనా కనీస ధర ఉంటుంది. ఉదాహరణకు టొమాటోలకు గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు వాటిని పారబోస్తారు తప్ప రవాణా ఛార్జీలు పెట్టుకొని మార్కెట్లకు తీసుకువెళ్ళరు. అమెరికా విపరీతంగా సుంకాలు పెంచితే ఆ దేశానికి ఎగుమతులు తగ్గించుకుంటారు.

ఉదాహరణకు భారత్‌ నుంచి జ్వరం మాత్రలు మొదలు క్యాన్సర్ మందుల వరకు వేలాది రకాల మందులు అమెరికాకు ఎగుమతవుతుంటాయి. ఆ ఎగుమతులు తగ్గితే వాటిని అమెరికా సొంతంగా తయారుచేసుకోవడం చాలా కష్టం. చేసుకోలేకపోతే ఇబ్బంది పడేది సగటు అమెరికన్లే.

ఇదే విదంగా భారత్‌ నుంచి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన ఐటి సేవలు పొందడం కష్టం కావచ్చు. అంటే అమెరికా సుంకాలు పెంచితే ఆయా దేశాలు మాత్రమే కాదు అమెరికా కూడా ఎంతో కొంత ఇబ్బంది పడక తప్పదు. నష్టపోకతప్పదన్న మాట!

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవగానే దేశ ప్రజలను ఆకట్టుకునేందుకే ట్రంప్‌ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నట్లయితే ఇవి తాత్కాలికమే అనుకోవచ్చు.

కానీ వీటిని కటినంగా అమలుచేయాలని ట్రంప్‌ ఫిక్స్ అయిపోతే అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ సమయంలో ట్రంప్‌ దుందుడుకు నిర్ణయాలు, ఆర్ధిక వ్యవస్థలని మరింత ప్రమాదకర స్థితికి నెట్టవచ్చు.