వైసీపీ పార్టీలో ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియతో జగన్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు వైసీపీ నాయకులు. తాడేపల్లి ఆర్కే నుండే జగన్ కు ఈ షాక్ ల పరంపర మొదలయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపు జరుగుతుంది. తాజాగా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ కి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్దమయినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
స్థానికంగా ఇంచార్జ్ ల పేర్లు మారిన వెంటనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి దొరబాబు సిద్ధమయ్యారని సమాచారం. గోదావరి జిల్లాలలో మంచి పట్టున్న జనసేన పార్టీలో చేరడానికి ఇప్పటికే జనసేన ముఖ్యనాయకులతో టచ్ లోకి వెళ్లారు దొరబాబు.స్థానికంగా ఉన్న తన క్యాడర్ కు పార్టీ మార్పు పై సమాచారం అందినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇలా జగన్ ఇంచార్జ్ ల మార్పు పేరుతో తానూ వద్దనుకుంటున్న నాయకులను పొమ్మనకుండా పొగ పెడుతున్నారా..? లేక ఆ నేతలే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
ఏది ఏమైనా ఇలా ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు అధికార పార్టీని వీడి తలో పార్టీ చూసుకుంటే అది ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తుంది అనేది జగన్ అండ్ కో గ్రహించలేకపోతున్నారా..?అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు వైసీపీ నాయకులు. తెలంగాణ ఎన్నికల ముందు అధికార బిఆర్ఎస్ పార్టీని వీడి చాల మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన వైనాన్ని వైసీపీ ఒక్కసారి గుర్తిస్తే తానూ చేస్తున్న తప్పిదం ఏమిటి అనేది అర్దమవయ్యే అవకాశం ఉంటుంది.




