ఏపీలో డీఎస్సీ… ఎవరిని మభ్యపెట్టాలని?

Botsa_Satyanarayana-_YSRCPవైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కోసం పనిచేసేందుకు లక్షలాదిమంది వాలంటీర్లను, గృహసారధులను నియమించుకొంది కానీ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదు. కనీసం ఉపాధ్యాయుల భర్తీకి డీఎస్సీ ప్రకటించలేదు. ఏమంటే ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు రెండేళ్ళు పొడిగించినందున ఖాళీలులేవని రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో సర్దిచెప్పుకొన్నారు. అయినా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఖాళీ లేవని చెపుతూ అయినా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పడం ఆయనకే చెల్లు.

ఆయన ఈ మాట చెప్పి అప్పుడే నాలుగు నెలలైంది. త్వరలోనే డీఎస్సీ ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ మంగళవారం మరోసారి ప్రకటించారు. దీని కోసం అధికారులు నివేదిక తయారు చేస్తున్నారని దాని ఆధారంగా సిఎం జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయం తీసుకొంటారని మంత్రి చెప్పారు.

ADVERTISEMENT

అయితే డీఎస్సీ కంటే ముందు ఉపాధ్యాయుల బదిలీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాల్సి ఉంటుందన్నారు. కనుక ఈ అంశాన్ని కూడా సిఎం జగన్‌ పరిశీలిస్తున్నారని అన్నారు. ఈ రెండింటిపై సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నాక డీఎస్సీ తప్పకుండా ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

డీఎస్సీ ప్రకటించాలంటే ముందుగా ఏమి చేయాలో ఆయనే చెపుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణల తర్వాత ఏర్పడే ఖాళీలను అధికారులు అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో లెక్కగట్టి, ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆయన అనుమతిస్తే రిజర్వేషన్లు, అర్హతలు, వయోపరిమితి వంటి అంశాలపై ఏపీపీఎస్సీ విద్యాశాఖ నుంచి అవసరమైన సమాచారం తీసుకొని నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టగలదు.

ఎంత వేగంగా పనిచేసినా ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం 2-3 నెలలు పడుతుంది. అప్పటికి శాసనసభ ఎన్నికలు ఇంకా దగ్గర పడతాయి. అయినా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసినా పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, అపాయింట్మెంట్ లెటర్స్, భర్తీ ప్రక్రియకు కనీసం 6-7 నెలలు పడుతుంది.

మద్యలో ఎవరో ఒకరు వీటిపై అభ్యంతరాలు చెపుతూ కోర్టుకు వెళుతుంటారు. ఉద్యోగాల భర్తీ వ్యవహారం కోర్టుకి వెళితే అది ఎప్పటికీ తేలుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుంది. అంటే డీఎస్సీ ప్రకటించినా ఇప్పట్లో ఉపాధ్యాయుల భర్తీ జరిగే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. కనుక డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మభ్యపెట్టేందుకే మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ అంటున్నారని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories