గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచే పార్టీలో సీనియర్ నేతలైన యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులను జగన్ పట్టించుకోవడం మానేశారు. కొడాలి నాని, వంశీ ఇద్దరూ స్నేహితులు. కనుక కొడాలి సూచన మేరకు ఈసారి వంశీకే గన్నవరం టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.
అంతకు ముందు దుట్టా రామచంద్రరావు ఇంటికి వెళ్ళి ఈవిషయంపై చర్చించాక ఆయన సూచన మేరకు మరోసారి టికెట్ ఇవ్వాలని అడిగేందుకు యార్లగడ్డ ప్రయత్నించారు. కానీ జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానిస్తే, సజ్జల రామకృష్ణారెడ్డి ‘పార్టీలో ఉంటే ఉండు లేకపోతే పో’ అంటూ ఇంకా అవమానించారని యార్లగడ్డ వెంకటరావు బాధపడ్డారు. అందుకే వైసీపీని వీడి టిడిపిలో చేరిపోయి గన్నవరం టికెట్ ఖరారు చేయించుకొన్నారు.
‘మనిషి ఉన్నంతవరకు వారి విలువ తెలియదు పోయాకే తెలుస్తుందన్నట్లు’ యార్లగడ్డ వెంకటరావు పార్టీలో ఉన్నప్పుడూ ఆయనను ఎవరూ గుర్తించలేదు. కానీ ఆయన బయటకు వెళ్ళిపోయి గన్నవరం నుంచే పోటీకి సిద్దమవడంతో వైసీపీ అధిష్టానం మేల్కొంది.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని శనివారం మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ వద్ద గల దుట్టా రామచంద్రరావు ఇంటికి రాయబారానికి పంపిస్తోంది. ఆయన చాలా సీనియర్, నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్నవారు కనుక ఆయన సేవలను వినియోగించుకొని యార్లగడ్డ వెంకటరావుకు, టిడిపికి చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దుట్టా రామచంద్రరావుని వైసీపీ రధం ఎక్కించుకొని ఆయన భుజంపై తుపాకి పెట్టి యార్లగడ్డ వెంకటరావుని, టిడిపిని కొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
కానీ ఇంతకాలం పట్టించుకోకుండా, యార్లగడ్డను అవమానకరంగా బయటకు సాగనంపిన తర్వాత ఇప్పుడు దుట్టా రామచంద్రరావు ఎక్కడున్నారు?అని వెతుక్కొంటూ వెళ్ళడం గమనిస్తే, వంశీ కోసం యార్లగడ్డ వెంకటరావును వదులుకొని పొరపాటు చేశామని వైసీపీ గ్రహించిన్నట్లే ఉంది.
వైసీపీపై, వంశీపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న యార్లగడ్డకు టిడిపి తోడవడం అగ్నికి వాయువు తోడైన్నట్లవుతుంది. కనుక. కానీ జగన్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న దుట్టా రామచంద్రరావు, ఈ రాయబారంతో జగన్‌కు జై కొడతారా… లేదా?త్వరలో తెలుస్తుంది.



