పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరూ ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరూ విన్నారు. వారిలో వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు.
ఆనాడు పవన్ కళ్యాణ్‌ని చాలా దారుణంగా అవహేళన చేసిన దువ్వాడ ఇప్పుడు తన భాగోతం బయట పడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవలసి వచ్చిందో ఇప్పుడు నాకూ అర్దమైంది. ఇప్పుడు నేనూ అదే పరిస్థితిలో ఉన్నాను. ఆనాడు ఆయన ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో నాకు తెలియదు కానీ ఆనాడు ఆయన ఆ సమస్యలను భరించలేకనే విడాకులు తీసుకుని వేరే వారిని వివాహం చేసుకున్నారని ఇప్పుడు నాకు అర్దమయ్యింది. మన దాకా వస్తేగానీ ఏదీ అర్దంకాదంటారు. అది నిజమే,” అని అన్నారు.
దువ్వాడ తాజా స్టేట్‌మెంట్ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతున్న వైసీపి నేతలందరికీ కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం.
అయితే దువ్వాడ శ్రీనివాస్‌కి, పవన్ కళ్యాణ్‌కి చాలా తేడా ఉంది. దువ్వాడ తన భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే సెకండ్ సెటప్ పెట్టేశారు. అందుకే ఆయన భార్య, కూతుర్లే వచ్చి ఆయనను నలుగురిలో నిలదీశారు. ఈ భాగోతం బయటపడి పరువు పోయిన తర్వాతే దువ్వాడ విడాకుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనతో శారీరిక సంబంధం పెట్టుకున్న మాధురి కూడా తాము తప్పు చేశామనుకోవడం లేదు.
కానీ పవన్ కళ్యాణ్ ఏ కారణంతో ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నా వారు ఏనాడూ మీడియా ముందుకు వచ్చి ఆయనని విమర్శించలేదు. ఇలా రాద్దాంతం చేయలేదు.
ఆయన రెండో భార్య రేణూ దేశాయ్ నేటికీ పవన్ కళ్యాణ్ పట్ల చాలా అభిమానం, గౌరవం చూపుతుంటారు. ఆమె పిల్లలు ఇద్దరూ కూడా నేటికీ తండ్రిని ఎంతో ప్రేమిస్తున్నారు. పవన్ మూడో భార్య అన్నా కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆమె పవన్‌కు ఎంతగానో ప్రేమిస్తున్నారు. అంటే విడిపోయినా వారి మద్య చక్కటి అనుబందాలు ఉన్నాయని అర్దమవుతోంది.
కనుక దువ్వాడ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌కి మద్య చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్ చట్టానికి, నైతిక విలువలకు కట్టుబడి జీవిస్తున్నారు. కానీ దువ్వాడ అందుకు భిన్నంగా సాగుతూ తన పరువు తానే తీసుకున్నారు. కనుక ఆయన పవన్ కళ్యాణ్‌తో పోల్చుకుని మాట్లాడవచ్చేమో గానీ ప్రజల సానుభూతి పొందలేరు. దువ్వాడ చేజేతులా పరువు తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి మాట్లాడటం కూడా తప్పే.




