రెండు రోజుల నాడు తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన మధ్య తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పళనిస్వామి బల నిరూపణ చెల్లదని, కోర్టుకు వెళితే అది రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీ తరువాత అత్యధిక ఎమ్మెల్యేలున్న డీఎంకే, రహస్య ఓటింగ్ జరపాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకురాగా, దాన్ని స్పీకర్ ధనపాల్ పట్టించుకోలేదని, తమిళ అసెంబ్లీ మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్ విమర్శించారు.
సభలో జరిగిన ఘటనలు నియమాలకు వ్యతిరేకమేనని, స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారని, కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్ లో ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో అసెంబ్లీలోనూ అలానే ఉన్నారని, అంతమాత్రాన రిసార్టులోనే బల నిరూపణ పూర్తి చేయాల్సిందని ముత్తయ్య ఎద్దేవా చేశారు. బల పరీక్షను రద్దు చేసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, అధికార పక్షానికి వెన్నుదన్నుగా స్పీకర్ నిలవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, మరోపక్కన పళనిస్వామి తమకు ముఖ్యమంత్రిగా అక్కర్లేదంటూ తమిళ తంబీలు గవర్నర్ విద్యాసాగర్ రావుకు వెల్లువలా ఈ-మెయిల్స్ పంపుతున్నారు. అన్నాడీఎంకే పోరుతో తాము అసంతృప్తికి గురయ్యామని, పళని ముఖ్యమంత్రిగా వద్దని, ఆయన సర్కారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సందేశాలను పంపుతున్నారు. మరోవైపు ఆయన్ను తిరస్కరించాలన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సైతం జోరుగా సాగుతోంది. తాము అమ్మ జయలలితను చూసి ఓట్లు వేశామని, ఈ పళని తమకు సీఎంగా తగిన వాడు కాదని చెబుతూ, వేలాది మంది గవర్నర్ కు మెయిల్స్ పంపడం విశేషం.



