యువనేత ఖాతాలో మరో … షీట్ !

ED files another chargesheet against Jaganవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏ-1 నిందితుడిగా ఇప్పటికే రెండు అంకెల సంఖ్యలో చార్జ్ షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇవన్నీ విచారణ దశలో ఉండగా, కొన్ని చార్జ్ షీట్లకు సంబంధించి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఇప్పటికే కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇదిలా ఉండగానే మరికొన్ని చార్జ్ షీట్లు వరుసగా దాఖలవుతూ వస్తున్నాయి. తాజాగా ప్రస్తుతం ఉన్నటువంటి చార్జ్ షీట్లకు తోడు ‘జగన్ అండ్ కో’ ఖాతాలో మరొకటి వచ్చి చేరింది.

జ‌గ‌న్మోహన్ రెడ్డి, విజ‌య్ సాయిరెడ్డి, పెన్నా ప్ర‌తాప్ రెడ్డిల‌ను నిందితులుగా పేర్కొంటూ పెన్నా సిమెంట్ వ్య‌వ‌హారంలో ఈడీ కోర్టులో అభియోగ‌ ప‌త్రం దాఖ‌లైంది. వీరంతా మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డినట్లు ఈడీ ఈ అభియోగంలో పేర్కొంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న ఈ కేసుల నుండి తప్పించుకునేందుకే జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేసారని రాజకీయ వర్గాల్లో జరిగిన బలమైన ప్రచారం తెలిసిన విషయమే. అయితే మరి ఈ పర్యటన జగన్ కు వర్కౌట్ కాలేదా? మరో చార్జ్ షీట్ దాఖలైంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT

ఎన్నికల సమయానికి ఇంకా రెండేళ్ళ సమయమే ఉండడంతో రానూ రానూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందులోనూ దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు అని కేంద్రం పిలుపునిస్తున్న నేపధ్యంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండే పార్టీలు ‘అధికారం – ప్రతిపక్షం’ ఉన్న నేపధ్యంలో… ప్రతిపక్ష పార్టీ అధినేతపై వరుసగా నమోదవుతున్న ఈ చార్జ్ షీట్లు పార్టీ మనుగడను ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయని, ఈ ఒరవడికి బ్రేక్ పడకపోతే డ్యామేజ్ ఎక్కువుండే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories