గుజరాత్ ఆనంది బెన్ పటేల్ కేబినెట్లో రవాణా శాఖతో పాటు ఆరోగ్య శాఖ బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి శంకర్ చౌదరి ఎంబీఏ దాకా విద్యనభ్యసించారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో దాఖలు చేసే అఫిడవిట్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి తన విద్యార్హతలను వెల్లడించారు. అయితే ఇటీవల తన రాష్ట్రంలోని ఓ పాఠశాలకు వెళ్లి, మంత్రి నుండి టీచర్ అవతారం దాల్చారు.
పుస్తకం చేత పట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పారు. అలాగే చేతిలో చాక్ పీసు పట్టి బోర్డుపై ఆంగ్లంలో ఆయా పదాలకు స్పెల్లింగ్ లు కూడా రాశారు. ఈ సందర్భంగా ‘ఏనుగు’ను ఆంగ్లంలో ఏమని పిలుస్తారంటూ ‘ఎలిఫెంట్’ అనే పదాన్ని బోర్డుపై రాశారు. అయితే ఆ పదంలోని ఆరో అక్షరం ‘ఏ’కు బదులు ఆయన ‘ఈ’ అని రాశారు. దీనిని గమనించిన ఓ విద్యార్థి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పుగా రాశారని చెప్పి మంత్రి గారికి షాకిచ్చారు.
ఈ వ్యవహారం మొత్తం తమ కళ్ల ముందు జరుగుతున్న నేపథ్యంలో మీడియా కూడా పూర్తిగా రికార్డు చేసి ప్రసారం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కేసింది. దీంతో దీనిపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. స్వయానా మంత్రివర్యులే ఇలా తప్పు స్పెల్లింగ్ లు రాయడమేంటి అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.



