తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతగా, మాజీ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా ఈటల రాజేంద్ర ప్రసాద్ కు క్షేత్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు, గౌరవం ఉన్నది.
అయితే ఈటల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ లో చేరిన నాటి నుంచి కూడా రాజకీయంగా కాస్త వెనకబడ్డారా.? లేదా బీజేపీ లో ఉండే అంతర్గత వర్గ పోరు ఈటలను వెనక్కి నెడుతుందా అన్నట్టుగా ఈటల రాజకీయ ప్రయాణం ఉండి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా సాగుతుంది.
బీజేపీ అధిష్టానం ఈటల రాజకీయ అనుభవాన్ని తన పార్టీ రాజకీయ బలోపేతానికి సరిగా వాడుకోలేకపోతుందా.? లేదా ఈటలే బీజేపీ రాజకీయంలో ఇమడలేకపోతున్నారా.? కాషాయ కండువా కప్పుకుని ఐదేళ్లు గడుస్తున్నా ఈటల ఇప్పటికి బీజేపీ నేతగా తనదయిన గుర్తింపు పొందలేదంటే బీజేపీ లో ఈటల రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుంది యిట్టె అర్ధమవుతుంది.
తానూ బీజేపీ నేతనే, తెలంగాణ రాజకీయాలలో యాక్టీవ్ గానే ఉన్నాను అని నిరూపించేందుకే ఈటల అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తున్నారా.? అన్నట్టుగా ఈటల తన ఉనికిని కాపాడుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు.తాజగా మీడియా ముందుకొచ్చిన ఈటల ఎవరి జాగీరని మీ ఫోటోలు వేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతల పై మండిపడ్డారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఇప్పటి సీఎం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదంటూనే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న 5 కేజీ ల సన్నబియ్యం పథకం పై ప్రధాని మోడీ ఫోటో వెయ్యకుండా మీ ఫోటోలు ముద్రించుకోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అయితే గతంతో పోలిస్తే కాషాయం ఈటల రాజకీయాన్ని నానాటికి కుదిస్తుందా అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలలో ఈటల పేరు పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. ఆయన పార్టీ కార్యక్రమాలపై కానీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం పై పోరాటాల విషయంలో కానీ తనతోటి రాజకీయ నేతలతో పోలిస్తే కాస్త వెనకబడ్డారని అనిపిస్తుంది.
బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తన పై సొంత కుటుంబ సభ్యులే విమర్శలతో విరుచుకుపడుతున్నా, కోవర్డ్ అంటూ కట్టప్ప అంటూ గుంటనక్క అంటూ హద్దులు దాటుతున్నా తగ్గేదెలా అన్నటుగా నిత్యం ఎదో ఒక కార్యక్రమంలో ప్రజలకు, క్యాడర్ కి అందుబాటులో ఉంటూ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
రేవంత్ సర్కార్ పై పోరాటాల విషయంలోనూ వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదుగా అన్నట్టుగా ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటు బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలను కూడా భుజాన మోస్తూ కేసీఆర్ లేని లోటు లేకుండా చేసేందుకు తనవంతు శ్రమిస్తున్నారు. ఈటల ఆ విషయంలో హరీష్ ని ఆదర్శంగా తీసుకుని క్షేత్ర స్థాయి పోరాటాలతో దూసుకుపోవాల్సి ఉంటుంది. అప్పుడే పొలిటికల్ గా తానూ పోగుట్టుకున్నది తిరిగి రాబట్టుకోగలుగుతారు.





