జూన్ 4 తరువాత స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయి అంటూ ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా లు చేసిన ప్రసంగాలను నిజం చేస్తూ జూన్ 4 కు ఒక్క రోజు ముందే స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. కేంద్రంలో 350 కి పైగా సీట్లతో మరో సారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రానుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ అన్ని మోడీకి పట్టం కట్టడంతో నిఫ్టీ 23 వేల మార్కును టచ్ చేసి ఆల్ టైం రికార్డు ను నమోదుచేసింది.
గత వారంలో బేరిష్ దిశగా పతనమైన దేశీయ మార్కెట్లు ఎగ్జిట్ పోల్స్ సర్వేలతో పుంజుకుని నేడు 800 పాయింట్ల గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి ఆల్ టైం హై ను తాకింది. ఫలితాల విడుదలకు ముందే స్టాక్ మార్కెట్ ఈ విధంగా అంచనాలను మించి పైకి ఎగబాకుతుంటే ఇక సర్వేల ఫలితాలకు తగ్గట్టుగా కానీ, అంతకు మించి కానీ ఎన్డీయే సీట్లను సాధించగలిగితే మార్కెట్ ఎనలిస్టుల అంచనాల ప్రకారం నిఫ్టీ 25 వేల మార్కును అందుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.
ప్రధానిగా మోడీ కి మరోసారి అవకాశం దక్కనుంది అనే ప్రచారంతో మార్కెట్లో అదానీ స్టాక్స్ రాలీ కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఎన్డీయే అందుకోగలదు అనే వార్తలతో మార్కెట్ ఏవిధంగా పైకి పరుగులు పెడుతుందో అదేవిధంగా ఒక వేళ సర్వే సంస్థల అంచనాలను ఎన్డీయే అందుకోలేకపోతే కూడా అదే విధంగా పతనమవ్వడం ఖాయంగా కనపడుతుంది. దీన్ని దృష్టిలోపెట్టుకుని ఈ రెండు మూడు రోజులు జాగ్రత్త గా మార్కెట్లో ట్రేడ్ చేయాలనీ సూచిస్తున్నారు ట్రేడ్ పండితులు.




