ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రధానంగా 1. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రాబోతోంది? 2. ఆంధ్రాలో ఏ కూటమి అధికారంలోకి రాబోతోంది?3.తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది? అనే మూడింటిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ముందుగా ఏపీ విషయానికి వస్తే, ప్రజలలో నెలకొన్న ఈ ఉత్కంఠని పసిగట్టిన అనేకమంది ఏదో ఓ అనామక సర్వే సంస్థ పేరుతో ఎన్నికల ఫలితాలు ఈవిదంగా ఉండబోతున్నాయని చెప్పేస్తున్నారు.
ఈ సర్వేలు, నివేదికలను చూసి సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ‘పకోడీ బండివాడి సర్వే… సన్నీలియోన్ సర్వే… ఏపీలో వైసీపి, టిడిపి కూటమి కలిపి మొత్తం 175కి 175 సీట్లు గెలుచుకోబోతున్నాయంటూ ఒకటే జోకులు పేలుతున్నాయి.
ఇవి సరిపోవన్నట్లు అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి వంటివారు కూడా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేశారు. రేవంత్ రెడ్డికి ఎన్నటికీ ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని జోస్యం చెప్పిన వేణుస్వామి, ఈసారి ఎన్నికలలో కూడా వైసీపి గెలిచి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు.
ఎన్నికల ఫలితాల గురించి తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నవారికి వేసవిలో చిరుజల్లులా ఈ పకోడీ సర్వేలు, జాతకాలు చాలా ఉపశమనం కలిగించే ఉంటాయి.
నేటితో లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ పూర్తికాబోతోంది కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వివిద మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి. అయితే గతంలో అవి చెప్పిన అంచనాలలో ఎన్ని నిజమయ్యాయి? కనీసం దగ్గరదగ్గరగా చెప్పగలిగాయో ఓ సారి చూద్దాం.
2019 ఎన్నికలలో టిడిపి 37 నుంచి 60 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని సిపిఎస్, ఆరా, ఇండియా టుడే, వీడీపీ జోస్యం చెప్పగా టిడిపి 23 సీట్లు గెలుచుకుంది. అవే సంస్థలు వైసీపి 111 నుంచి 135 వరకు గెలుచుకుంటుందని చెప్పగా 151 సీట్లు గెలుచుకుంది. జనసేన 1-5 సీట్లు గెలుచుకుంటుందని చెప్పగా ఒక్క సీటు గెలుచుకుంది.
మొత్తంగా చూస్తే వాటి అంకెల లెక్క తప్పినప్పటికీ, టిడిపి ఓటమి, వైసీపి గెలుపుపై వాటి అంచనాలు నిజమయ్యాయని రుజువు అయ్యింది. కనుక ఈరోజు అవి ప్రకటించబోయే ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా నిజమవుతాయనే ఆశిద్దాం.




