శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని ఏజన్సీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పేశాయి. అంటే నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి కాబోతున్నారన్న మాట!
543 సీట్లు కలిగిన లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 సీట్లు అవసరం ఉండగా ఎన్డీయే కూటమి 353-383 సీట్లు గెలుచుకోబోతోందని ఏబీపీ-సీఓటర్ చెప్పింది. మిగిలిన ఏజన్సీల గణాంకాలు కూడా కాస్త అటూ ఇటూగా ఉన్న చెప్పిన విషయం మాత్రం అదే.
ఇండియా కూటమి ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు సాధించబోతోంది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేలిపోయింది. ఇండియా కూటమి ఈసారి 152-182 సీట్లు గెలుచుకోబోతోందని, ఇతరులు 4-12 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నారని ఏబీపీ-సీఓటర్ చెప్పింది.
మోడీ మళ్ళీ పగ్గాలు చేపడితే దేశానికి బలమైన నాయకత్వం, సుస్థిరమైన విధానాలు ఉన్న ప్రభుత్వం ఏర్పడుతుంది. భారత్ గురించి ప్రపంచదేశాలకు ఓ చక్కటి సందేశం పంపించిన్నట్లవుతుంది. కనుక రాబోయే ఏళ్ళలో భారత్‌కు మరిన్ని భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తాయి. మోడీ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది కనుక భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
అయితే మోడీ మళ్ళీ ప్రధాని అయితే దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాల మనుగడ చాలా కష్టం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆగస్టులో పడగొడతామన్నట్లు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పడానికి ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం, ఓడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలు కూల్చేసి అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాలు తప్పక చేయవచ్చు.
మోడీ ప్రభుత్వం ఇప్పటికే మతం ఆధారంగా ప్రజల మద్య చిచ్చు పెడుతోందని సెక్యులర్‌వాదులు వాదిస్తున్నారు. తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని భైంసాలో అల్లర్లు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇలాంటి అనేక కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు కూడా. కనుక కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తే కొంచెం ఇష్టం… కొంచెం కష్టం తప్పదు.




