ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో వైసీపిని వ్యతిరేకించేవారందరూ వాటికే ఓట్లు వేస్తారని వేరే వేస్తారు. ఆలాగే ఈ రెండు పార్టీల పొత్తుల వలన రాష్ట్రంలో కాపులతో సహా కొన్ని కులాల ఓటర్లు వాటివైపే మొగ్గు చూపుతారు. కనుకనే వాటిని కలవనీయకుండా దూరంగా ఉంచేందుకు వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నం లేదు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.
మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతూ టిడిపి, జనసేనల సీట్ల సర్దుబాట్ల గురించి చర్చిస్తున్నారు. నేడో రేపో వారు తమ తమ అభ్యర్ధులను ప్రకటించనున్నారు. కనుక ఆ రెండు పార్టీల మద్య చిచ్చు పెట్టేందుకు చివరి ప్రయత్నంగా, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు సంతకంతో ఓ నకిలీ లేఖ సోషల్ మీడియాలో వదిలారు.
దాని సారాంశం ఏమిటంటే ఇరు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు పూర్తయ్యాయని, టిడిపి 112, జనసేన 69 స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన్నట్లు దానిలో పేర్కొన్నారు. టిడిపి లెటర్ హెడ్ మీద ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు సంతకంతో ప్రత్యక్షమైన ఆ లేఖలో పేర్కొన్న విషయాలు నిజమనే టిడిపి, జనసేనల శ్రేణులు భావించడం సహజం. అయితే అది నకిలీ లేఖ అని టిడిపి వెంటనే సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఇదివరకు వారాహి యాత్రలలో పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో జనసేన బలపడింది కనుక ఈసారి 65-70 ఎమ్మెల్యే, 4-5 ఎంపీ సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు శ్రేణులు కోరుకొంటున్నారు. జనసేన ఓ రాజకీయ పార్టీ కనుక ఈవిదంగా కోరుకోవడం సహజమే. దానిని తప్పు పట్టలేము.
కానీ జనసేన నిజంగా అన్ని సీట్లు తీసుకుని ఎన్నికలలో వైసీపి అభ్యర్ధులను ఎదుర్కొని నిలబడగలదా?నిలబడినా గెలవగలదా?అంటే లేదనే వైసీపికి గట్టి నమ్మకం. అందుకే జనసేన శ్రేణులను రెచ్చగొట్టి ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టేలా చేయగలిగితే, టిడిపి, జనసేన కూటమిని చిత్తుచిత్తుగా ఓడించి మళ్ళీ అధికారంలో రావచ్చని దురాలోచన చేస్తున్నట్లు భావిస్తోంది. అందుకే ఈ నకిలీ లేఖను సృష్టించి సోషల్ మీడియాలో పెట్టిందనుకోవచ్చు.
తద్వారా జనసేన శ్రేణులకు తమ పార్టీ 69 స్థానాలలో పోటీ చేయబోతోందనే నమ్మకం కలిగించగలిగితే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సీట్ల సర్దుబాట్లు చేసుకుని, టిడిపికి 135-150 సీట్లు, జనసేనకు 20-25 సీట్లు కేటాయించిన్నట్లు ప్రకటిస్తే జనసేనలో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. దాంతో పవన్ కళ్యాణ్ ఒత్తిడికి గురై పార్టీలో అసంతృప్తిని చల్లార్చడానికి, మరిన్ని సీట్ల కోసం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెస్తే వాటి పొత్తులు ప్రశ్నార్ధకంగా మారుతాయి.
జనసేనకు 69 సీట్లు కేటాయించిన్నట్లు సోషల్ మీడియాలో నకిలీ లేఖ పోస్ట్ చేయడంతో టిడిపిలో కలకలం మొదలవుతుంది. నిజానికి టిడిపిలో 175 స్థానాలకు కనీసం 350 మందికి పైగా పోటీ పడుతున్నారు. కనుక ఇప్పుడు 175 సీట్లలో 69 సీట్లు జనసేనకు ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏమిటని టిడిపి నేతలు ఆందోళన చెందుతూ చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించడం ఖాయం.
ఈవిదంగా రెండు పార్టీలలో చిచ్చు రగిలించగలిగితే వాటి పొత్తులు విచ్ఛిన్నం అవుతాయని వైసీపి ఆశ పడుతున్నట్లు అర్దమవుతోంది.
నిత్యం ధర్మపన్నాలు వల్లించే వైసీపి దీని కోసం టిడిపి పేర నకిలీ లేఖను సృష్టించడం గమనిస్తే ఆ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని అర్దమవుతుంది. కనుక టిడిపి, జనసేనలు శ్రేణులు ఇటువంటి వైసీపి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం.
Fake News Alert #YCPFakeBrathuku #2024JaganNoMore#WhyAPHatesJagan #AndhraPradesh pic.twitter.com/e9Gjm1MOwf
— Telugu Desam Party (@JaiTDP) January 24, 2024




