కౌంటింగ్ కు కౌన్ డౌన్ మొదలయ్యింది. మరికొన్ని గంటల్లోనే ఐదేళ్ల వైసీపీ పాలనకు, ఐదేళ్ల ప్రతిపక్షాల పోరాటాలకు ప్రజా తీర్పు వెలువడనుంది. పోలింగ్ రోజు మొదలైన అల్లర్లతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
పల్నాడు, పిఠాపురం, తాడిపత్రి, చంద్రగిరి, కడప వంటి ప్రాంతాలలో భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. రేపు కౌంటింగ్ డే కావడంతో సోషల్ మీడియా పోస్టుల పైన కూడా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఫలితాల కోసం అన్ని పార్టీల మద్దతుదారులు ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
దాదాపు మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూటమికే పట్టం కట్టినప్పటికీ ఇంకా మ్యాచ్ లో చివరి బాల్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు వైసీపీ నేతలు. ఈ ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీవీ డిబేట్లలలో మొదలుకుని అసెంబ్లీ సమావేశాల వరకు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలకు మరికొన్ని గంటలలో శుభం కార్డు పడుతుంది అనే ఆశతో కూటమి మద్దతుదారులు, ఓటమి భయంతో వైసీపీ మద్దతుదారులు నిముషాలు లెక్కపెడుతున్నారు.
ఇన్నాళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినా, ప్రశ్నించినా వారి పై కేసులు పెట్టి, అరికాళ్లకు లాఠీ వాతలు రుచి చూపించి ప్రతిపక్షాలను భయపెట్టిన వైసీపీ కి ఇప్పుడు ‘ఓటమి తాలూకా భయం గ్రాములలో, కేజీలలో కాదు టన్నుల్లో’ కనపడుతుంది. ఇన్నాళ్లుగా మీడియా ముందుకొస్తే బూతులతో నోటికి మాత్రమే పని చెప్పే వైసీపీ నేతల స్వరంలో ఇప్పుడు ఓటమి తాలూకా భయం స్పష్టంగా కనపడుతుంది.
సింహం సింగల్, వై నాట్ 175 , 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ వైసీపీ నాయకులు ఇచ్చిన నినాదాలు ఇప్పుడు మచ్చుకైనా ఎక్కడ వినిపించడం లేదు. రిగ్గింగ్ అంటూ రీ కౌంటింగ్ అంటూ వైసీపీ ముఖ్య నేతలు చేస్తున్న ఆర్తనాదాలు వినిపించుకోవడానికి జగన్ కూడా సిద్ధంగా లేని పరిస్థితి. టీడీపీ, జనసేన పార్టీల పొత్తుతోనే వైసీపీ కి ఓటమి భయం పట్టుకున్నప్పటికి ఎదో ఒక కారణంతో ఈరెండు పార్టీలు, రెండు సామజిక వర్గాలు పరస్పరం అభిప్రాయం భేదాలతో దూరమవుతాయి అని ఆశగా చూసిన వైసీపీకి నిరాశే ఎదురయ్యింది.
సీట్ల సర్దుబాటు నుండి ఓటు బదిలీ వరకు అన్ని అంశాలలో పై స్థాయి నాయకుల నుండి క్రింద స్థాయి కార్యకర్త వరకు ఒకటే లక్ష్యంతో పని చేసారు. అయితే టీడీపీ, జనసేన జోడికి బీజేపీ మద్దతు ఇవ్వడంతో వైసీపీ మేకపోతు గాంభీర్యాలతో వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసింది. మే 13 న జరిగిన పోలింగ్ విధానంతో, పోలైన ఓట్ల శాతంతో వైసీపీ లో ఓటమి భయం అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇన్నాళ్ల వైసీపీ అణివేతకు తమ రక్తంతో బదులిచ్చారు టీడీపీ శ్రేణులు.
తలలు పగిలిన, రక్తాలు చిందినా వెనకడుగు వేసేదే లేదు అన్నట్టుగా ప్రాణాలను పణంగా పెట్టి పోలింగ్ బూతులతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు టీడీపీ, జనసేన శ్రేణులు. ఈ ఐదేళ్ల అవమానాలు, అణివేతలు జూన్ 4 తో ముగింపు పలకడానికి, విజయోత్సవ సంబరాల కోసం కూటమి నేతలు, ఈ ఐదేళ్ల అధికారాన్ని, అహంకారాన్ని కోల్పోబోతున్నాం అన్న ఆవేదనలో ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు రేపటి సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నారు.
మరి రేపు సూర్యోదయం ఏ పార్టీకి వెలుగు నిస్తుందో..ఏ పార్టీకి చీకటిని మిగులుస్తుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని గంటల నిరీక్షణ తప్పనిసరి. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వ సాధారణమైన అంశం. ఒకరు నెగ్గాలంటే ఖచ్ఛితంగా మరొకరి ఓడాల్సిందే. ఈ రాజకీయ నాయకుల ఆటలో పావులుగా మారి వారి గెలుపు కోసం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ దాడులకు తెగబడితే సమాధి అయ్యేది కార్యకర్తల జీవితాలే అనేది గ్రహించాలి.




