ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే నేటికీ సమాజంలో చాలా గౌరవం లభిస్తుంటుంది. అటువంటి ఓ ఐపీఎస్ అధికారి అధ్వర్యంలో పనిచేసే సీఐడీ సంస్థ నేరస్తులను కనిపెట్టి కోర్టు ముందు నిలబెట్టాలనుకోవడం అత్యాశ కాదు.
కానీ నేరస్తులను పట్టుకోవలసిన సీఐడీ డీజీగా చేసిన ఐపీఎస్ అధికారి సంజయ్ అవినీతికి పాల్పడ్డారు. అంతకు ముందు అగ్నిమాపక శాఖలో కూడా ఆయన చేతి వాటం ప్రదర్శించారని ఏసీబీ తేల్చి చెప్పి కేసు నమోదు చేసింది. నిప్పుకి చెదలు పట్టాయనే మాట అప్పుడప్పుడు వినపడుతుంటుంది. ఓ మాజీ సీఐడీ డీజీ అవినీతి కేసులో అరెస్ట్ అవడం అంటే అదేనేమో?
అయన జగన్‌కు అనుకూలంగా పనిచేయడంతో సరిపెట్టుకొని ఉండి ఉంటే ‘ఈ రోజుల్లో ఇది కామన్’ అని ప్రజలు కూడా సరిపెట్టుకొని ఉండేవారు. కానీ అవినీతికి పాల్పడ్డారు. కనుక కేసు, కోర్టులు, జైలు తప్పలేదు.
ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంతకాలం అరెస్ట్ కాకుండా సంజయ్ తప్పించుకోగలిగారు. కానీ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడమే కాకుండా నాలుగు వారాలలోగా ఏసీబీకి లొంగిపోవాలని ఆదేశించింది.
వేరే గత్యంతరం లేకపోవడంతో సంజయ్ మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఏసీబీ కోర్టు ఆయనకు సెప్టెంబర్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
జగన్ హయంలో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జైల్లో గడిపినా ‘ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తునందుకు తమపై చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు’ అంటూ తమ కేసులు, అరెస్టుని రాజకీయంగా వాడుకొని మళ్ళీ లబ్ది పొందగలరు.
కానీ జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన సంజయ్ వంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రం జైలుకి వెళితే సమాజంలో, ముఖ్యంగా బంధుమిత్రులలో వారి గౌరవ ప్రతిష్టలు మంట గలిసిపోతాయి. జైల్లో ఎంతకాలం ఊచలు లెక్కబెట్టినా ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ లభించకపోగా మనోవేదన, అవమాన భారం తప్పదు.
సంజయ్ వంటి అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్‌ని నమ్ముకొని చెలరేగిపోయినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించకతప్పడం లేదు. కానీ అప్పుడు వారిని వాడుకున్న జగన్ ఇప్పుడు ఆదుకోవడానికి రావడం లేదు! కనుక ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదు. సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యానికి తేడా ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.





