YS Jagan

పిల్లి శాపలకు ఉట్టి తెగదు… పాలకడవ కింద పడదన్నట్లు జగన్‌ కోరుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడదు. ఒకవేళ సాధ్యమనుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ చేసిన పోరాటలతో జగన్‌ హయాంలోనే రాష్ట్రపతి పాలన విధించబడి ఉండేది.

ఆనాడు జగన్‌ పాలనలోనే రాష్ట్రంలో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొన్నాయని సాక్షాత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు కూడా. కానీ కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించలేదు. ఈ విషయం జగన్మోహన్‌ రెడ్డికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు తాను అడగ్గానే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించేయాలని జగన్‌ కోరుకుంటున్నారు. అదీ కొత్త ప్రభుత్వానికి నెలన్నర రోజులు గడవక మునుపే!

Also Read – వరద కష్టాలతో ప్రభుత్వానికి కొత్త పాఠాలు… నేర్చుకోవలసిందే!

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ జగన్‌ ఢిల్లీలో ధర్నాకి బయలుదేరుతుండటం ఎలా ఉందంటే వెయ్యి ఎలుకలు తిన్న హజ్ యాత్రకు బయదేరిందనే ఉర్దూ సామెతని గుర్తు చేస్తోంది.

జగన్‌ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడిచినప్పటికీ టిడిపి, జనసేనలు ఓపికగా 5 ఏళ్ళు జగన్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడాయి. కానీ రక్తం రుచి మరిగిన పులిలా అధికారం రుచి మరిగిన జగన్‌కు అంత ఓపిక లేదు. అందుకే నెలరోజులకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించేయాలని ఆరాటపడిపోతున్నారు.

Also Read – తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న వర్షాలు..!

జగన్‌ ఏవిదంగా రాష్ట్రాన్ని పాలించారో చూసిన ప్రజలు ఆయనను ఇక భరించలేమనుకునే గద్దె దింపేశారు. అయినా జగన్‌ ధోరణి మారలేదని సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజం.

ఇంతకాలం నేను ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారు. నేను ఏమి చేసినా ప్రజలు సహిస్తారు. వారు గొర్రెలు… సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడితే 175కి 175 సీట్లు ఇచ్చి గెలిపించేస్తానే గుడ్డి భ్రమలో జగన్‌ బ్రతికారు.

Also Read – టీడీపీలో ఆరోపణలు వచ్చాయి..ఆదేశాలు వెళ్లాయి..మరి వైసీపీలో.?

ఇప్పుడూ అలాగే వినుకొండలో, ఢిల్లీలో డ్రామాలు ఆడితే ఏదో జరిగిపోతుందని భ్రమ పడుతున్నట్లున్నారు. కానీ జగన్‌ చేస్తున్న ఈ శవ రాజకీయాలను చూసి రాష్ట్ర ప్రజలు ఆయనను మరింతగా అసహ్యించుకుంటారు. దాని వలన ఆయనే ఇంకా నష్టపోతారు.

అంతే కాదు ఈవిదంగా వ్యవహరిస్తూ జగన్‌ మరో సమస్యను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఇలాగే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని అనవసరమైన మాటలు మాట్లాడారు. ఆవిదంగా రేవంత్‌ రెడ్డిని రెచ్చగొట్టడం వలన లేదా తన వలన ఆయన ప్రభుత్వానికి ప్రమాదం ఉందని పదేపదే బెదిరించడం వలననే రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేశారు.

జగన్‌ కూడా చంద్రబాబు నాయుడుని అలాగే రెచ్చగొడుతూ రాబోయే రోజుల్లో ఎప్పుడో ఎదుర్కొబోయే సమస్యలను చేజేతులా ముందుకు జరుపుకుంటున్నారని చెప్పవచ్చు.

ఎవరికైనా బాధ పడితే కానీ బోధ పడదంటారు. కానీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి బాధపడుతున్నా జగన్‌కు ఇంకా బోధపడకపడకపోవడం ఆయనను నమ్ముకున్న వైసీపి నేతల దౌర్భాగ్యమేగా?