మాజీ ఆర్ధిక మంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ (66) కాసేపటి క్రితం కన్ను మూశారు. రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 9న ఎయిమ్స్ లో చేరారు. పేరొందిన డాక్టర్లు ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేసిన సఫలం కాలేకపోయారు. ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలను విడిచి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నెలలోనే మరో కీలక నేత సుష్మా స్వరాజ్ చనిపోవడంతో బీజేపీ శ్రేణుల శోకసముద్రంలో మునిగిపోయాయి.
విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఎమర్జెన్సీ టైమ్‌లో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన టైమ్‌లో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా పనిచేశారు.
పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి… కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో అరుణ్ జైట్లీని రాజ్యసభ సభ్యుడిని చేసి ఆర్థికమంత్రి పదవిని అప్పగించారు. అయితే 2019 ఎన్నికల్లో అరుణ్ జైట్లీ పోటీ చెయ్యలేదు. కొత్త ప్రభుత్వంలో తనకు ఎటువంటి బాధ్యతా అప్పగించొద్దని ప్రధానిని కోరారు.



